Asia Cup 2023 India vs Nepal: హాఫ్ సెంచరీలు చేసుకున్న రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్... నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచి సూపర్ 4 స్టేజీకి అర్హత సాధించిన భారత జట్టు..

ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా సూపర్ 4 స్టేజీకి చేరుకుంది. పాక్‌తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయినా, నేపాల్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సునాయాస విజయం అందుకుంది భారత జట్టు. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియాకి 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు అంపైర్లు.

కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యంతో మ్యాచ్‌ని 20 ఓవర్లలోనే ముగించింది టీమిండియా. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు రోహిత్ శర్మ. రోహిత్ కెరీర్‌లో ఇది 49వ వన్డే హాఫ్ సెంచరీ. ఆసియా కప్‌లో 10 సార్లు 50+ స్కోర్లు బాదిన మొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 9 సార్లు ఈ ఫీట్ సాధించగా విరాట్ కోహ్లీ 8 సార్లు ఆసియా కప్‌లో 50+ స్కోర్లు చేశాడు... ఓవరాల్‌గా కుమార సంగర్కర, ఆసియా కప్‌లో 12 సార్లు 50+ స్కోర్లు చేసి, రోహిత్ కంటే ముందున్నాడు. 

మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ శర్మ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేయగా శుబ్‌మన్ గిల్ 62 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేశాడు. 

231 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా 2.1 ఓవర్లలో 17 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కురవడంతో దాదాపు 2 గంటల పాటు ఆట నిలిచిపోయింది.. దీంతో విలువైన సమయం కోల్పోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్ణయించారు అంపైర్లు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొదటి 5 ఓవర్లలో టీమిండియా ఫీల్డర్లు 3 క్యాచులను డ్రాప్ చేశారు. దీన్ని వాడుకున్న నేపాల్ ఓపెనర్లు 9.5 ఓవర్లలో తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన కుశాల్ బుర్టెల్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో 7 పరుగులు చేసిన భీం శక్తిని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 8 బంతుల్లో 5 పరుగులు చేసిన నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్‌ కూడా జడ్డూ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

5 బంతుల్లో 2 పరుగులు చేసిన కుశాల్ మల్ల, జడ్డూ బౌలింగ్‌లో సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓపెనర్ ఆసిఫ్ షేక్ 97 బంతుల్లో 8 ఫోర్లతో 58 పరుగులు చేసి హాఫ్ సెంచరీ అందుకున్నాడు.. 35 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన గుల్షాన్ జా కూడా మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనే ఇషాన్ కిషన్‌ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు.

25 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసిన దీపేంద్ర సింగ్, 56 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన సోమ్‌పాల్ కమి.. నేపాల్ స్కోర్‌ని 230 మార్కుకి చేర్చారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.