టీమిండియా ఆడే మ్యాచులన్నీ యూఏఈలో... మిగిలిన మ్యాచులు పాకిస్తాన్‌లో! ఆసియా కప్ 2023 నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించే ఆలోచనలో ఆసియా క్రికెట్ కౌన్సిల్..
ఆసియా కప్ 2023 టోర్నీ గురించి ఏడాదిగా సందిగ్ధత కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం 2023 ఆసియా కప్ నిర్వహణ హక్కులను సొంతం చేసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). అయితే పాక్‌లో టోర్నీ జరిగితే టీమిండియా అక్కడికి వెళ్లదని, టీమిండియా లేకుండానే ఆసియా కప్ 2023 ఆడుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది బీసీసీఐ...
తటస్థ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా చేసిన కామెంట్లు పెను దుమారం రేపాయి. ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా, పాకిస్తాన్‌కి రాకపోతే తాము ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాల్గొనబోమని కామెంట్ చేసింది పీసీబీ. పాక్ నుంచి ఆసియా కప్‌ని తరలిస్తే, ఆ టోర్నీలో కూడా ఆడమని హెచ్చరించింది పాక్ క్రికెట్ బోర్డు...
పాకిస్తాన్‌లో జరిపితే ఇండియా ఆడలేమని అంటుంటే, వేరే దేశంలో పెడితే తాము ఆడబోమని పాక్ అంటోంది. దీంతో ఎట్టకేలకు ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణ కోసం ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆసియా కప్ 2023 టోర్నీలో సగం మ్యాచులు పాకిస్తాన్‌లో, మిగిలిన సగం మ్యాచులు యూఏఈలో నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)...
టీమిండియా ఆడే మ్యాచులన్నీ యూఏఈలో జరిగితే, మిగిలిన మ్యాచులు పాకిస్తాన్‌లో యథావిథిగా కొనసాగుతాయి. ఇండియా ఫైనల్‌కి అర్హత సాధిస్తే, యూఏఈలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా ఫైనల్‌కి రాకపోతే పాకిస్తాన్‌లో ఫైనల్ జరుగుతుంది...
అయితే ఇది అనుకున్నంత తేలిక కాదు. యూఏఈలోనే మ్యాచులన్నీ ఆడే భారత జట్టుకి ఇది పెద్ద ఇబ్బంది కాకపోయినా మిగిలిన జట్లు, అక్కడికి ఇక్కడికి తిరగాల్సి ఉంటుంది. యూఏఈలో టీమిండియాతో మ్యాచ్ ఆడిన తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ వంటి జట్లు... మళ్లీ తర్వాతి మ్యాచ్ కోసం పాకిస్తాన్‌కి వెళ్లాల్సి ఉంటుంది...
అంటే అటు ఇటు తిరగడానికే సగం టైమ్ సరిపోతుంది. ఇక ప్రాక్టీస్ చేయడం, రెస్ట్ తీసుకోవడానికి తగినంత సమయం దొరకదు. ఇండియా, పాక్ ఒప్పుకున్నా, మిగిలిన దేశాలు ఇలా అటు, ఇటు తిరగడానికి ఒప్పుకుంటాయా? అనేది అనుమానమే. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగితే అది యూఏఈలోనే నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? అనేది అనుమానమే. కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లో కంటే ఎక్కువగా యూఏఈలోనే ఎక్కువ మ్యాచులు ఆడింది పాక్.
ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియాపై మొట్టమొదటి విజయం అందుకుంది కూడా యూఏఈలోనే. కాబట్టి వాళ్లకి యూఏఈలో ఆడడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు... ఈ నెల ప్రథమార్ధంలో బెహ్రాయిన్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాక్, ఆసియా కప్ వేదికను మార్చేందుకు ఒప్పుకోలేదు.
ఆసియా కప్‌ని పాక్ నుంచి తరలిస్తే, తాము వన్డే వరల్డ్ కప్ ఆడమని పట్టుబట్టింది. దీంతో వచ్చే నెలలో మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ వేదికపై ఓ క్లారిటీ రానుంది..
