ఆఫ్ఘాన్‌పై 89 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న బంగ్లాదేశ్... 75 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్, 51 పరుగులు చేసిన కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ... 

ఆసియా కప్ 2023 టోర్నీలో తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్‌పై 89 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుని బోణీ కొట్టింది. 334 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్, 245 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

7 బంతులాడిన రెహ్మానుల్లా గుర్భాజ్ 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. 57 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసిన రెహ్మాత్ షా, టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 74 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్, హసన్ మహమూద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

60 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేసిన కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ, షోరీఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. నజీబుల్లా జద్రాన్ 17, మహ్మద్ నబీ 3, గులాబుద్దీన్ 15, కరీం జనత్ 1, రషీద్ ఖాన్ 24, ముజీబ్ వుర్ రహీం 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4 వికెట్లు తీయగా షోరీఫుల్ ఇస్లాంకి 3 వికెట్లు దక్కాయి. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 334 పరుగుల భారీ స్కోరు చేసింది..

బంగ్లాదేశ్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 60 పరుగులు జోడించిన తర్వాత మహ్మద్ నయీం 32 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తోహిద్ హృదయ్‌ని గుల్బాద్దీన్ డకౌట్ చేయడంతో 63 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. 

ఈ దశలో మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ షాంటో కలిసి మూడో వికెట్‌కి 215 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. 119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్... వన్డేల్లో రెండో సెంచరీ బాదాడు.

సెంచరీ తర్వాత ముజీబ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మెహిదీ హసన్, ఎడమ చేతికి గాయం కావడంతో రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో కూడా వన్డేల్లో రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు..

15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన ముస్తఫికర్ రహీం కూడా రనౌట్ కావడంతో వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్..

ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన షమీమ్ హుస్సేన్ కూడా రనౌట్ అయ్యాడు. అయితే మరో ఎండ్‌లో 18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్, బంగ్లా స్కోరు 330 దాటించాడు... 

సెప్టెంబర్ 5న ఆఫ్ఘాన్, శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ గెలిస్తే, మూడు జట్ల మధ్య నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.