Asia Cup 2022: శ్రీలంక-బంగ్లాదేశ్ లకు ఆసియా కప్-2022లో ఉండాలో వెళ్లాలో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. నేడు ఈ రెండు జట్లు కీలక పోరులో తలపడనున్నాయి.
ఆసియా కప్-2022లో భాగంగా మాజీ ఛాంపియన్ శ్రీలంక నేడు బంగ్లాదేశ్ లో కీలక పోరులో తలపడుతున్నది. గతంలో ఐదు సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంక.. ఈసారి తొలి మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ చేతిలో దారుణంగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో చతికిలపడ్డ ఆ జట్టు.. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న గ్రూప్-బి ఐదో మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్ ఆడుతున్నది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ కు రానుంది.
ఈ మెగా టోర్నీలో నిలవాలంటే రెండు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకం. గ్రూప్ - బిలో ఉన్న ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్ లో అఫ్గాన్ చేతిలో దారుణంగా ఓడాయి. లంక, బంగ్లాను ఓడించిన అఫ్గాన్ ఇప్పటికే సూపర్-4కు చేరింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన విజేత సూపర్-4కు చేరే రెండో జట్టు (గ్రూప్-బిలో) అవుతుంది. ఓడిన జట్టు ఇంటికి పయనమవుతుంది.
తమ దేశంలో జరగాల్సిన ఆసియా కప్.. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో యూఏఈ చేరడంతో ఇక్కడైనా మెరుగ్గా ఆడాలని భావించిన లంకకు ఆదిలోనే షాక్ తగిలింది. అఫ్గానిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 105 పరుగులకే ఆలౌట్ అయింది. సీనియర్ల నిష్క్రమణ తర్వాత తంటాలు పడుతున్న లంక బ్యాటింగ్.. అఫ్గాన్ తో తొలి మ్యాచ్ లో దారుణంగా విఫలమైంది. భానుక రాజపక్స ఒక్కడే 38 పరుగులతో టాప్ స్కోరర్. మిగిలినవారిలో చమీక కరుణరత్నె ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగిలినవారంతా అలా వచ్చి ఇలా వెళ్లారు. మరి నేటి మ్యాచ్ లో అయినా లంక బ్యాటర్లు నిలుస్తారో లేదో చూడాలి.
ఇక బంగ్లాదేశ్ కథ కూడా ఏమంత గొప్పగా లేదు. అఫ్గాన్ తో మ్యాచ్ లో బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా వంటి స్టార్ బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. హోసేన్ ఒక్కడు (48) పోరాడాడు. కానీ స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కాపాడుకోలేకపోయింది. మరి నేటి మ్యాచ్ లో బంగ్లా పులులు గర్జిస్తాయా..? లేక తోకముడుస్తాయా..? అనేది ఆసక్తికరం.
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 12 టీ20లు ఆడగా 8 మ్యాచ్ లలో లంక గెలిచింది. బంగ్లా నాలుగింటిలో నెగ్గింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక తరఫున మతీష పతిరాన ఆడటం లేదు. అసిత ఫెర్నాండో అరంగేట్రం చేశాడు. బంగ్లా జట్టులో మూడు మార్పులు జరిగాయి.
