Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: లంకకు చుక్కలు చూపించిన ఆఫ్ఘాన్ బౌలర్లు.. నబీ అండ్ కో ముంగిట ఈజీ టార్గెట్

Asia Cup 2022: ఆసియా కప్ ప్రారంభం మ్యాచ్ లో ఆఫ్ఘాన్ బౌలర్లు అదరగొట్టారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.

Asia Cup 2022: Sri Lanka Bowled out of 105, Sets Easy Target For Afghanistan
Author
First Published Aug 27, 2022, 9:22 PM IST

ఆసియా కప్ -2022లో బోణీ కొట్టేందుకు  ఆఫ్ఘానిస్తాన్ రంగం సిద్దం చేసుకున్నది. ఈ మెగా టోర్నీలో ఘనమైన రికార్డు కలిగిన శ్రీలంకకు తొలి మ్యాచ్ లోనే చుక్కలు చూపించింది.  లంకతో దుబాయ్ వేదికగా జరుగుతున్న  గ్రూప్-బి తొలి మ్యాచ్ లో ఆ జట్టును 105 పరుగులకే  ఆలౌట్ చేసి షాకిచ్చింది. ఆఫ్ఘాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి లంకను కోలుకోనీయకుండా చేశారు. శ్రీలంకలో భానుక రాజపక్స (29 బంతుల్లో 38, 5 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగిలినవారంతా  విఫలమయ్యారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  శ్రీలంకకు తొలి ఓవర్లోనే ఫజల్లా ఫరూఖీ షాకిచ్చాడు. అతడు వేసిన లంక ఇన్నింగ్స్ తొలి ఓవర్లో.. కుశాల్ మెండిస్ (2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.  అదే ఓవర్లో ఆఖరి బంతికి ఫరూఖీ.. అసలంకను డకౌట్ చేశాడు.  

రెండో ఓవర్లో నవీన్ ఉల్ హక్..  పతుమ్ నిస్సంక (3)ను ఔట్ చేశాడు. దీంతో లంక 2 ఓవర్లలో 5 పరుగులకే ముగ్గురు టాపార్డర్ బ్యాటర్ల వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత గుణతిలక (17) తో జతకలిసిన  రాజపక్స కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 44 పరుగులు జోడించారు. అజ్మతుల్లా  వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన  గుణతిలక.. ముజీబ్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి కరీమ్ జనత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  

 

ఇక ఆ తర్వాత రాజపక్స  కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడు నిలుస్తారనుకున్న వనిందు హసరంగ (2), కెప్టెన్ దసున్ శనక (0)లు  అలా వచ్చి ఇలా వెళ్లారు.  వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో ఏకాగ్రత కోల్పోయిన రాజపక్స.. మహ్మద్ నబీ వేసిన 13వ ఓవర్లో రెండో బంతికి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికి మహేశ్ తీక్షణ (0) కూడా రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. 13 ఓవర్లు ముగిసేసరికి లంక స్కోరు 8 వికెట్ల నష్టానికి 70 పరుగులు. 

చివర్లో చమీక కరుణరత్నె (38 బంతుల్లో 31.. 3 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడి లంక స్కోరును వంద పరుగులు దాటించాడు. మధుశనక (1 నాటౌట్) అతడికి అండగా నిలిచాడు. ఫలితంగా శ్రీలంక 19.4 ఓవర్లలో 105 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫజల్లా ఫరూఖీ రెండు ఓవర్లో బౌలింగ్ చేసి ఓ మెయిడిన్ వేసి 3 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. నవీన్ ఉల్ హక్ 2 ఓవర్లలో 15 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ముజీబ్ రహ్మన్, మహ్మద్ నబీలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.  తొలి మ్యాచ్ లో నెగ్గాలంటే ఆఫ్ఘాన్.. 20 ఓవర్లలో 106 పరుగులు చేయాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios