Asianet News TeluguAsianet News Telugu

పాక్‌పై లంకదే తొలి విజయం... విజయంతో ఆసియా కప్ 2022 ఫైనల్‌కి...

ఆసియా కప్ 2022 టోర్నీలో మరోసారి టాస్ గెలిచిన జట్టుకే దక్కిన విజయం... ఫైనల్‌కి ముందు పాక్‌పై ఘన విజయం అందుకున్న శ్రీలంక...

Asia Cup 2022: Sri Lanka beats Pakistan in super 4 match before Final
Author
First Published Sep 9, 2022, 10:47 PM IST

ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీని ఆరంభించిన శ్రీలంక జట్టు, టేబుల్ టాపర్‌గా ఫైనల్ చేరింది. మరో ఫైనలిస్ట్ పాకిస్తాన్‌తో జరిగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది లంక... 122 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్, రెండో బంతికే కుశాల్ మెండీస్ వికెట్ కోల్పోయింది. మహ్మద్ హస్నైన్ బౌలింగ్‌లో ఇఫ్తాన్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మెండీస్. ఆ తర్వాత ధనుష్క గుణతిలకని డకౌట్ చేసిన హరీస్ రౌఫ్, లంకకి ఊహించని షాక్ ఇచ్చాడు. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది శ్రీలంక...

12 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వ కూడా హరీస్ రౌఫ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంకను భనుక రాజపక్ష, ఓపెనర్ పథుమ్ నిశ్శంక కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

19 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన భనుక రాజపక్ష, ఉస్మాన్ ఖాదీర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసిన లంక కెప్టెన్ దసున్ శనక, మహ్మద్ హస్నైన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

అయితే అప్పటికే విజయానికి 22 బంతుల్లో 9 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితికి చేరుకుంది శ్రీలంక. క్రీజులోకి వచ్చిన వానందు హసరంగ రెండు ఫోర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న పథుమ్ నిశ్శంక, 48 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 19.1 ఓవర్లలో 121 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతూ వస్తున్న బాబర్ ఆజమ్, టాప్ 2 స్కోరర్‌గా ఉన్న మహ్మద్ రిజ్వాన్ కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించారు..

14 బంతులాడిన ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన నెం.1 టీ20 బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 14 పరుగులు చేసి ప్రమోద్ మదుషాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన ఫకార్ జమాన్‌ని కరుణరత్నే అవుట్ చేశాడు...

29 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వానిందు హసరంగ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇఫ్తికర్ అహ్మద్ 17 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే అసిఫ్ ఆలీని గోల్డెన్ డకౌట్ చేశాడు వానిందు హసరంగ... 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్.

కుష్‌దిల్ షా 4 పరుగులు చేసి ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో అవుట్ కాగా ఉస్మాన్ ఖదీర్ 3 పరుగులు చేశాడు. 18 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు... హరీస్ రౌఫ్‌ 1 పరుగుకే అవుట్ కావడంతో 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది పాకిస్తాన్...

వానిందు హసరంగ 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మహీశ్ తీక్షణ, ప్రమోద్ మధుషాన్ రెండేసి వికెట్లు తీశారు. ధనంజయ డి సిల్వ, ఛమీరా కరుణరత్నేలకు చెరో వికెట్ దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios