Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: సగం పగ తీరింది..! పాక్ పనిపట్టిన భారత పేసర్లు.. టీమిండియా ముందు ఊరించే టార్గెట్

India Vs Pakistan: ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత పేసర్లు అదరగొట్టారు. సీనియర్  బౌలర్ భువనేశ్వర్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు యువ  పేసర్లు అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్ లు పాక్‌కు చుక్కలు చూపారు. 
 

Asia Cup 2022: Pakistan bowled out at 147, India Needs 148 runs To win the Battle
Author
First Published Aug 28, 2022, 9:33 PM IST

ఆసియా కప్ లో ఘనంగా బోణీ కొట్టాలని చూసిన టీమిండియా అందుకు సగం పనిని పూర్తి చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఓడించి గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు ఆ మేరకు సఫలీకృతమైంది. భారత పేస్ త్రయం భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ లతో పాటు ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాలు మ్యాజిక్ చేశారు. ఆది నుంచే పాక్ పని పట్టారు. క్రమం తప్పకుండా వికెట్లు తీసి పాక్ ను కోలుకోనీయకుండా చేశారు. భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 19.5  ఓవర్లలో147 పరుగులకే ఆలౌట్ అయింది.  ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 148 పరుగులు చేయాల్సి ఉంది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్‌కు భువనేశ్వర్ భారీ షాకిచ్చాడు.  తొలి ఓవర్లోనే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువీ.. తన రెండో ఓవర్లో నాలుగో బంతికి ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ ను పెవిలియన్ కు పంపాడు.  అతడు వేసిన షాట్ బంతిని బాబర్ భారీ షాట్  ఆడేందుకు యత్నించగా.. అది కాస్తా టాప్ ఎడ్జ్ కు తాకి అర్ష్‌దీప్ సింగ్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పాకిస్తాన్ 15 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. 

ఆ తర్వాత వచ్చిన ఫకర్ జమాన్.. రెండు ఫోర్లు కొట్టి  జోరుమీద కనిపించినా అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో అతడు దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  పవర్ ప్లే లో వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన ఇఫ్తికర్.. రెండు ఫోర్లు, ఓ సిక్సర్ తో దాటిగా ఆడాడు. చాహల్ వేసిన 12వ ఓవర్లో అతడు భారీ సిక్సర్ బాది స్కోరును పెంచే యత్నం చేశాడు.  అయితే ఆ తర్వాత బంతికే అతడు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు.

ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఇఫ్తికర్ ను ఔట్ చేసేందుకు రోహిత్.. హార్ధిక్ కు బంతినిచ్చాడు. 13వ ఓవర్ వేసిన హార్ధిక్.. తొలి బంతికే ఇఫ్తికర్ ను బోల్తా కొట్టించాడు. అతడు వేసిన షాట్ బంతిని ఆడబోయి వికెట్ కీపర్ ఇఫ్తికర్ దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చాడు.

ఆ తర్వాత ఓవర్లో  పాండ్యా.. తొలి బంతికే రిజ్వాన్ నూ ఔట్ చేసి పాక్ కు కోలుకోలేని షాకిచ్చాడు. పాండ్యా వేసిన 15వ ఓవర్ తొలి బంతికి రిజ్వాన్.. అవేశ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో అతడి మీద భారీ ఆశలు పెట్టుకున్న పాక్ కలలు కల్లలయ్యాయి. అదే ఓవర్లో పాండ్యా.. పాక్ కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడో బంతికి.. ఖుష్దిల్ (2) ను ఔట్ చేశాడు. ఖుష్దిల్ జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 

 

ఆ తర్వాత  మళ్లీ బౌలింగ్ కు వచ్చిన భువీ.. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడో బంతికి అసిఫ్ అలీని ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే అర్ష్‌దీప్.. మహ్మద్ నవాజ్ ను పెవిలియన్ కు పంపాడు. భువీ తన చివరి ఓవర్లో వరుస బంతుల్లో షాదాబ్ ఖాన్ (10), నసీమ్ షా (0) లను ఔట్ చేశాడు. చివర్లో షాన్వాజ్ దహానీ (6 బంతుల్లో 16.. 2 సిక్సర్లు) పాక్  స్కోరును 140 దాటించాడు. కానీ అతడిని  అర్ష్‌దీప్ బౌల్డ్ చేశాడు. 

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్.. 4 ఓవర్లలో 26  పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. హార్ధిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.అర్ష్‌దీప్ 2 వికెట్లు తీయగా అవేశ్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios