Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకి ఘోర పరాభవం... ఆఖరి ఓవర్‌లో పాకిస్తాన్ ఉత్కంఠ విజయం...

భారత్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్... ఆసియా కప్‌లో రోహిత్ సేనకి తొలి పరాజయం... క్యాచ్ డ్రాప్ చేసి విలన్‌గా మారిన అర్ష్‌దీప్ సింగ్...

Asia Cup 2022 India vs Pakistan: Team India lost against Pakistan in Last Over Thriller
Author
First Published Sep 4, 2022, 11:29 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, పాక్ మధ్య సూపర్ 4 మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఉత్కంఠ విజయం అందుకుని, భారత్‌ చేతుల్లో తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది...

182 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్‌కి శుభారంభం దక్కలేదు. బాబర్ ఆజమ్ 10 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 18 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన ఫకార్ జమాన్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఈ దశలో మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ నవాజ్ కలిసి నాలుగో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్‌ని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు...

యజ్వేంద్ర చాహాల్ 15వ ఓవర్‌లో 16 పరుగులు సమర్పించగా 16వ ఓవర్‌లో కీలక వికెట్ తీసిన భువీ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రిజ్వాన్ అవుట్ అయ్యే సమయానికి పాక్ విజయానికి 19 బంతుల్లో 35 పరుగులు కావాలి...

రవిభిష్ణోయ్ వేసిన 18వ ఓవర్‌లో మూడో బంతికి అసిఫ్ ఆలీ క్యాచ్ కోసం రివ్యూ తీసుకుంది టీమిండియా. బంతి, బ్యాటుకి తగులుతున్నట్టు రిప్లైలో కనిపించినా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాతి బంతికే అసిఫ్ ఆలీ ఇచ్చిన క్యాచ్‌ని అర్ష్‌దీప్ సింగ్ జారవిడిచాడు...

కీలకమైన 18వ ఓవర్‌లో మూడు వైడ్లు వేసిన రవిభిష్ణోయ్, 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో పాక్ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 26 పరుగులు కావాల్సి వచ్చాయి. 

19వ ఓవర్‌లో 19 పరుగులు సమర్పించాడు భువనేశ్వర్ కుమార్. దీంతో మ్యాచ్ పాక్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు కావాల్సి ఉండగా అసిఫ్ ఆలీ రెండో బంతికి ఫోర్ బాదాడు. మూడో బంతికి పరుగులేమీ రాకపోగా నాలుగో బంతికి అసిఫ్ ఆలీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్... అప్పటికి పాక్ విజయానికి ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే కావాలి.

క్రీజులోకి వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్, ఎలాంటి టెన్షన్ లేకుండా 2 పరుగులు తీసి మ్యాచ్‌ని ముగించాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి కుష్‌దిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

కెప్టెన్‌గా ఆసియా కప్‌లో 17 సిక్సర్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. ఇంతకుముందు ఎంఎస్ ధోనీ 16 సిక్సర్లు, షాహిదీ ఆఫ్రిదీ 12, సౌరవ్ గంగూలీ 11 సిక్సర్లు బాది రోహిత్ తర్వాతి స్థానాల్లో నిలిచారు...

టీ20ల్లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మధ్య ఇది 14వ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం. టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యధికం. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి అవుట్ కాగా రిషబ్ పంత్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. 

హార్ధిక్ పాండ్యా 2 బంతులాడి డకౌట్ కాగా దీపక్ హుడా 14 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో నిలదొక్కుకుపోయిన విరాట్ కోహ్లీ... మహ్మద్ హస్నైన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...


విరాట్ కోహ్లీకి టీ20ల్లో ఇది 32వ 50+ స్కోరు. రోహిత్ శర్మ రికార్డును అధిగమించి, టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. 44 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆఖరి ఓవర్‌లో రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios