Asia Cup 2022: ఆసియా కప్-2022లో గ్రూప్ దశ ముగిసింది. ఆరు జట్లు పోటీపడగా నాలుగు జట్లు సూపర్-4కు అర్హత సాధించాయి. మరి ఈ దశలో భారత్ పోటీ ఎవరితో అంటే..
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2022లో గ్రూప్ దశ ముగిసింది. ఇక రేపటి (సెప్టెంబర్ 3) నుంచి సూపర్ -4 కు తెరలేవనుంది. గ్రూప్ దశలో తమ గ్రూప్ లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడిన జట్లు.. ఇప్పుడు తమ గ్రూప్ లోని టీమ్‌తో పాటు ఇతర గ్రూప్ లోని రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ మేరకు షెడ్యూల్ ఎప్పుడో సిద్ధమవగా తాజాగా పాకిస్తాన్-హాంకాంగ్ మ్యాచ్ లో పాక్ విజయం సాధించడంతో సూపర్-4కు అర్హత సాధించిన జట్లు కూడా తేలిపోయాయి. మరి సూపర్-4లో ఎవరితో ఎవరు పోటీ పడతారనే వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
గ్రూప్-బి నుంచి అప్గానిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టు కాగా బంగ్లాదేశ్ ను ఓడించిన లంక రెండో జట్టుగా చేరింది. ఇక గ్రూప్-ఏ లో రెండు విజయాలతో భారత్ గ్రూప్ టాపర్ గా సూపర్-4కు చేరగా.. హాంకాంగ్ ను ఓడించి పాకిస్తాన్ కూడా ఇక్కడకు వచ్చింది.
సూపర్-4 లో భారత్ మ్యాచ్ లు :
- గ్రూప్-ఏలో రెండు విజయాలతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈనెల 4 మరోసారి పాకిస్తాన్ తో తలపడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 6న శ్రీలంక తో ఆడుతుంది. ఇక సెప్టెంబర్ 8న అఫ్గానిస్తాన్ తో తలపడనుంది. ఈ మూడు మ్యాచులు దుబాయ్ వేదికగానే జరుగుతాయి.
సూపర్ -4 షెడ్యూల్ :
- సెప్టెంబర్ 3 : శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్ - షార్జా
- సెప్టెంబర్ 4 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ - దుబాయ్
- సెప్టెంబర్ 6 : ఇండియా వర్సెస్ శ్రీలంక - దుబాయ్
- సెప్టెంబర్ 7 : పాకిస్తాన్ వర్సెస్ అఫ్గానిస్తాన్ - షార్జా
- సెప్టెంబర్ 8 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ - దుబాయ్
- సెప్టెంబర్ 9 : శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ - దుబాయ్
- సెప్టెంబర్ 11 : సూపర్-4లో టాప్-2గా నిలిచిన రెండు జట్లు ఫైనల్ పోరులో తలపడతాయి. ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే భారత్-పాకిస్తాన్ ల మధ్యే ఫైనల్ జరుగుతుందని గతంలో అంచనా వేసినా అఫ్గానిస్తాన్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రూప్ దశలో ఆ జట్టు బంగ్లాదేశ్, శ్రీలంకలను చిత్తుగా ఓడించింది. దీంతో ఫైనల్ భారత్-పాక్ మధ్య కాక భారత్-అఫ్గాన్ మధ్య జరుగుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరి ఫైనల్ చేరేదేవరో తేలాలంటే ఈనెల 9 వరకు వేచి చూడాల్సిందే.
