Asianet News TeluguAsianet News Telugu

Asia Cup 2022: ఆసియా కప్ ఆరంభం.. తొలి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆఫ్ఘానిస్తాన్

Asia Cup 2022: నాలుగేండ్ల విరామం తర్వాత  ఆసియా కప్ ఆరంభమైంది.  అక్టోబర్ లో జరగాల్సి  ఉన్న టీ20  ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న ఈ మెగా టోర్నీ కోసం ఆసియా క్రికెట్ జట్లు హోరాహోరి పోరుకు సిద్ధమయ్యాయి. 

Asia Cup 2022: Afghanistan Won The Toss and Elected bat First Against Sri lanka
Author
First Published Aug 27, 2022, 7:04 PM IST

క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2022 ఆరంభమైంది. ఆసియా ఖండంలోని ఆరు దేశాలు ఆడుతున్న ఈ మెగా టోర్నీ వేదికలు, తేదీలు మారుతూ.. అసలు జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎట్టకేలకు  యూఏఈలో 15వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో శ్రీలంక..  ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతున్నది. గ్రూప్-బి (శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్) లో భాగంగా ఉన్న లంక, ఆప్ఘాన్ లు తొలి మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి.స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉన్న దుబాయ్ పిచ్ లో  ప్రపంచపు అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్న రెండు జట్లు ఎలా ఆడతాయని ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గతకాలపు వైభవం కోసం తహతహలాడుతున్న శ్రీలంక.. దానిని తిరిగి దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నది. ఇక ఆఫ్ఘాన్ కూడా తక్కువ తినలేదు. తమదైన రోజున  ఏ జట్టునైనా ఓడించడానికి ఆఫ్ఘాన్ పోరాడుతుంది.  

దసున్ శనక సారథ్యంలోని శ్రీలంక  జట్టులో కెప్టెన్ తో పాటు గుణతిలక, నిస్సంక, చరిత్ అసలంక, రాజపక్స వంటి హిట్టర్లున్నారు. బౌలింగ్ లో వనిందు హసరంగ ఆ జట్టుకు పెద్ద ప్లస్. స్పిన్ కు సహకరించే  దుబాయ్ పిచ్ లో హసరంగ కీలకంగా మారనున్నాడు. 

మరోవైపు మహ్మద్ నబీ సారథ్యంలోని ఆఫ్ఘాన్ జట్టు కూడా అటు బ్యాటర్లు, ఇటు హిట్టర్లతో పాటు ఏ క్షణంలో అయినా మ్యాచ్ ను మలుపు తిప్పే  రషీద్ ఖాన్ ఉన్నాడు. స్పిన్  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థుడు రషీద్. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఒకే ఒక టీ20 మ్యాచ్ జరుగగా..  అందులో లంకనే విజయం వరించింది. ఆఫ్ఘాన్ కు  టీ20లలో ఇది వందో మ్యాచ్ కావడం గమనార్హం.

ఆసియా కప్ లో పాల్గొంటున్న ఆరు దేశాలు : 
- ఇండియా, పాకిస్తాన్, హాంకాంగ్ (గ్రూప్-ఏ)
- బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, శ్రీలంక (గ్రూప్-బి)  
- ఆరు దేశాలు మొత్తంగా 13 మ్యాచ్ లు ఆడనున్నాయి. రెండు గ్రూపులుగా విభజించిన ఈ టోర్నీలో మ్యాచ్ లన్నీ దుబాయ్, షార్జా వేదికగా జరుగనున్నాయి. 
- 2018లో వన్డే ఫార్మాట్ లో ముగిసిన ఈ టోర్నీ ఇప్పుడు టీ20 ఫార్మాట్ లో జరుగుతున్నది. 
- ఇప్పటిదాకా నిర్వహించిన 14 ఆసియా కప్ లలో 7 టైటిళ్లు భారత్ గెలిచింది. శ్రీలంక 5, పాకిస్తాన్ 2 ట్రోఫీలను నెగ్గింది.  

మ్యాచ్ వేదిక : దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ 

ఇలా చూడొచ్చు : స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ 

 

Follow Us:
Download App:
  • android
  • ios