Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: అదరగొట్టిన అఫ్గాన్.. బంగ్లాకు బ్యాండ్ బాజా

Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్-అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న గ్రూప్-బి మూడో మ్యాచ్ లో అఫ్గాన్ బౌలర్లు అదరగొట్టారు. 
 

Asia Cup 2022: Afghanistan bowlers Restrict Bangladesh  at 127
Author
First Published Aug 30, 2022, 9:15 PM IST

ఆసియా కప్ లో అఫ్గానిస్తాన్ అదరగొడుతున్నది. తమ తొలి మ్యాచ్ లో మాజీ ఛాంపియన్ శ్రీలంకను గజగజ వణికించి గెలుపు బోణీ కొట్టిన ఆ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్ కూ తమ బౌలింగ్ రుచి చూపించింది. అఫ్గాన్ స్పిన్నర్ల ధాటికి బంగ్లా..  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. అఫ్గానిస్తాన్ స్పిన్నర్లు ముజీబ్ ఉర్ రెహ్మన్, రషీద్ ఖాన్ లు బంగ్లాదేశ్ ను ఆదిలోనే దెబ్బతీశారు. ఇద్దరూ తలో మూడు వికెట్లతో చెలరేగారు. బంగ్లా బ్యాటర్లలో ముసద్దేక్ హోస్నేన్ (31 బంతుల్లో 48 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 128 పరుగులు  చేయాల్సి ఉంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కు మొదటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఆ జట్టు ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అఫ్గాన్ యువ స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్.. బంగ్లాకు షాకిచ్చాడు. ఆ ఓవర్లో అతడు వేసిన ఆఖరి బంతికి బంగ్లా ఓపెనర్ నయీమ్  (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

తన తర్వాత ఓవర్లో ముజీబ్.. అనముల్ (5) ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. అయితే  నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షకిబ్ అల్ హసన్ మీద బంగ్లా భారీ ఆశలు పెట్టుకుంది. అదీగాక అతడికి టీ20లలో ఇది వందో మ్యాచ్ కావడంతో షకిబ్ భారీ స్కోరు చేస్తానడి ఆ దేశ అభిమానులు ఆశించారు. నవీన్ ఉల్ హక్ వేసిన 5వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన షకిబ్.. ముజీబ్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి పవర్ ప్లేలో బంగ్లాదేశ్.. 3 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. 

ఇక ఆ తర్వాత వికెట్లు పడగొట్టే బాధ్యతను రషీద్ ఖాన్ తీసుకున్నాడు. రషీద్ తాను వేసిన తొలి ఓవర్లోనే ముష్ఫీకర్ రహీమ్ (1) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. 10 ఓవర్లకు బంగ్లా స్కోరు 4 వికెట్ల నష్టానికి 50 పరుగులకు చేరింది. 11వ ఓవర్ వేసిన రషీద్.. మూడో బంతికి అఫిఫ్ హుస్సేన్ (12) ను కూడా ఎల్బీడబ్ల్యూ చేసి బంగ్లాను కోలుకోనీయకుండా చేశాడు. 

 

87కే 5 వికెట్లు కోల్పోయిన క్రమంలో మహ్మదుల్లా (27 బంతుల్లో 25, 1 ఫోర్), ముసద్దేక్ హోసేన్ లు బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని రషీద్ విడదీశాడు. అతడు వేసిన 16వ ఓవర్ నాలుగో బంతిని మహ్మదుల్లా భారీ షాట్ ఆడబోయి మిడ్ వికెట్ వద్ద ఉన్న ఇబ్రహీం జద్రాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరినా ముసద్దేక్ ధాటిగా ఆడటంతో బంగ్లా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios