Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: ఆసియా కప్‌లో బోణీ కొట్టిన ఆఫ్ఘాన్.. లంకకు దారుణ ఓటమి..

Asia Cup 2022: స్వల్ప లక్ష్య ఛేదనలో  ఆఫ్ఘాన్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఆ జట్టు ఓపెనర్లు తొలి పవర్ ప్లే లోనే లంకకు ఎలాంటి అవకాశాల్లేకుండా తమ జట్టు విజయాన్ని ఖాయం చేశారు.
 

Asia Cup 2022: Afghanistan Beats Sri lanka by 8 wickets
Author
First Published Aug 27, 2022, 10:22 PM IST

ఆసియా కప్‌ టైటిల్ వేటను ఆఫ్ఘానిస్తాన్ ఘనంగా ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన  తొలి మ్యాచ్‌లో ఆ జట్టు..  మాజీ ఛాంపియన్లకు చుక్కలు చూపించింది. ముందు బౌలింగ్ లో లంకను దెబ్బతీసిన ఆఫ్ఘాన్లు.. తర్వాత బ్యాటింగ్ లోనూ రెచ్చిపోయారు. లంకను 105 పరుగులకే ఆలౌట్ చేసి.. ఆ తర్వాత లక్ష్యాన్ని 10.1  ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. ఆఫ్ఘాన్ ఓపెనర్లు.. రహ్మనుల్లా గుర్బాజ్ (18 బంతుల్లో 40, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (28 బంతుల్లో 37 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్సర్) లు  అనుభవం లేని లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. మరో 59 బంతులు మిగిలుండగానే ఆఫ్ఘాన్ ఘన విజయాన్ని అందుకుని మెగా టోర్నీలో బోణీ కొట్టింది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో  ఆఫ్ఘాన్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. తొలి ఓవర్ వేసిన మధుశనక ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. ఆ ఓవర్లో చివరి బంతికి ఫోర్ తో ఖాతా తెరిచాడు హజ్రతుల్లా జజాయ్. మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెచ్చిపోయాడు. మతీష పతిరాన వేసిన  ఆ ఓవర్లో అతడు 4,6,4 తో విరుచుకుపడ్డాడు. 

పతిరాన వేసిన ఐదో ఓవర్లో గుర్బాజ్ రెండు సిక్సర్లతో పాటు ఫోర్ బాది ఆఫ్ఘాన్ స్కోరును పరిగెత్తించాడు. అతడికి తోడు జజాయ్ కూడా ధాటిగా ఆడటంతో  ఆ జట్టు స్కోరు పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్లింది.  తొలి పవర్ ప్లే ముగిసేటప్పటికీ ఆఫ్ఘాన్.. వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. 

ఏడో ఓవర్ వేసిన హసరంగ.. తొలి బంతికే గుర్బాజ్ ను  క్లీన్ బౌల్డ్ చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన ఇబ్రహీం జద్రాన్ (15)తో కలిసి జజాయ్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు. చివర్లో  3 పరుగులు సాధించాల్సి ఉండగా ఇబ్రహీం రనౌట్ అయ్యాడు. నజీబుల్లా (2) నాటౌట్ గా నిలిచాడు.  ఈ విజయంతో  ఆసియా కప్ లో ఆఫ్ఘాన్ బోణీ కొట్టి సూపర్-4 కు వెళ్లడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంది. 

 

అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. లంక ఇన్నింగ్స్ లో భానుక రాజపక్స (38) టాప్ స్కోరర్ కాగా చివర్లో చమీక కరుణరత్నె (31) ధాటిగా ఆడి ఆ జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫరూఖీ మూడు వికెట్లు తీయగా.. ముజీబ్, నబీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios