Asianet News TeluguAsianet News Telugu

Asia Cup:నజీబుల్లా వీరవిహారం.. అఫ్గాన్‌కు రెండో విజయం.. పోరాడి ఓడిన బంగ్లాదేశ్

Asia Cup 2022: స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గనిస్తాన్ మరీ నెమ్మదిగా ఆడింది. 15 ఓవర్ల వరకు ఆ జట్టు గెలుస్తుందా..? అనే అనుమానం కూడా ఉంది. కానీ చివర్లో వచ్చిన నజీబుల్లా వీరవిహారం చేసి  అఫ్గాన్ కు రెండో విజయాన్ని అందించాడు. 

Asia Cup 2022: Afghanistan Beat Bangladesh By 7 wickets, Qualifies Super - 4
Author
First Published Aug 30, 2022, 10:45 PM IST

ఆసియా కప్-2022లో తమ తొలి మ్యాచ్ లో శ్రీలంకను ఓడించిన అఫ్గాన్.. రెండో మ్యాచ్ లో కూడా బంగ్లాదేశ్ ను ఓడించి గ్రూప్-బి లో అగ్రస్థానానికి చేరింది.  బ్యాటింగ్ లో విఫలమైన బంగ్లాదేశ్ బౌలింగ్ లో మెరుగ్గా రాణించినా చివర్లో పట్టువిడవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. బంగ్లా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 18.3 ఓవర్లలో 131 పరుగులు సాధించి రెండో విజయాన్ని అందుకుంది. ఛేదనలో కాస్త తడబడ్డా చివర్లో నజీబుల్లా  సిక్సర్లతో వీరవిహారం చేసి అఫ్గాన్ కు రెండో విజయాన్ని అందించాడు.  అఫ్గాన్ తొలి మ్యాచ్ లో లంకను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. 

స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. గత మ్యాచ్ లో లంకపై ధాటిగా ఆడిన ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (18 బంతుల్లో 11, 1 ఫోర్) ఆటలు ఈ మ్యాచ్ లో చెల్లలేదు. షకిబ్ అల్ హసన్ వేసిన అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ తొలి బంతికి అతడు ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. 

తక్కువ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సీమర్ల కంటే స్పిన్నర్లతో  బెటరనే అభిప్రాయంలో ఉన్న షకిబ్.. వాళ్లతోనే ఎక్కువ ఓవర్లు వేయించాడు. దీంతో అఫ్గాన్ కు పరుగుల రాక గగనమైంది. ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ (26 బంతుల్లో 23, 3 ఫోర్లు) నిదానంగా ఆడి చివరికి హోసెన్  వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పది ఓవర్లు ముగిసేసరికి అఫ్గాన్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు మాత్రమే. 

జజాయ్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహ్మద్ నబీ (8) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 13వ ఓవర్ ఆఖరు బంతికి అతడిని సైఫుద్దీన్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. 15 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 76 పరుగులే. అప్పటికీ 5 ఓవర్లలో అఫ్గాన్ 52 పరుగులు చేయాలి. 

నబీ నిష్క్రమించిన తర్వాత  క్రీజులోకి వచ్చిన నజీబుల్లా జర్దాన్ (17 బంతుల్లో 43 నాటౌట్, 1 ఫోర్, 6 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. మోహదీ హసన్ వేసిన 16వ ఓవర్లో ఐదో బంతికి  సిక్సర్ బాదాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన ముష్ఫీకర్ బౌలింగ్ లో కూడా 6, 6 కొట్టాడు. ఇక సైఫుద్దీన్ వేసిన 18వ ఓవర్లో తొలి బంతికి ఇబ్రహీం  జద్రాన్ (41 బంతుల్లో 42 నాటౌట్, 4 ఫోర్లు) ఫోర్ కొట్టగా.. నజీబుల్లా ఫోర్, సిక్సర్ బాదాడు. దీంతో  మ్యాచ్ లో అఫ్గాన్ విజయం ఖాయమైపోయింది. ఇక మిగిలిన లాంఛనాన్ని కూడా అతడే పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో  షకిబ్ అల్ హసన్, ముసద్దేక్ హోసేన్, మహ్మద్ సైఫుద్దీన్ తలా ఓ వికెట్ తీశారు. 

 

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఆ జట్టులో ముసాద్దేక్ హోసేన్ (48) టాప్ స్కోరర్. అఫ్గాన్ బౌలర్లలో  రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లు తలా మూడు వికెట్లు తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios