ఈ సీజన్ ఐపీఎల్‌లో వివాదాస్పదంగా మారిన ‘మన్కడింగ్’ పద్ధతితో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఒకసారి కూడా వార్నింగ్ ఇవ్వకుండా అవుట్ చేయడం మంచి పద్దతి కాదని విమర్శలు రావడంతో.. తర్వాత మ్యాచ్ నుంచి వార్నింగ్ ఇవ్వడం మొదలెట్టాడు అశ్విన్.

ఈ క్రమంలో తనను మన్కడింగ్ చేయాలంటూ అశ్విన్‌కు శిఖర్ ధావన్ సరదాగా వార్నింగ్ ఇవ్వడంతో అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఢిల్లీ ముందు 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్ ధాటిగా ఆడుతున్న సమయంలో అశ్విన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ సమయంలో అశ్విన్ బంతి వేయడానికి వచ్చి ఒక్కసారిగా ఆగిపోయాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ధావన్‌కు మన్కడింగ్ గుర్తొచ్చి క్రీజులోనే ఉండిపోయాడు.

ఆ తర్వాత బంతి వేస్తున్న సమయంలో శిఖర్ పరిగెత్తుతున్నా.. వీలైతే మన్కడింగ్ చెయ్’’ అంటూ అశ్విన్ వైపు చూస్తూ.. బిజార్ డ్యాన్స్ చేశాడు. దీనిని ఐపీఎల్ యాజమాన్యం ట్వీట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొందింది.