టీమిండియా ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా(36) క్రికెట్ కి వీడ్కోలు పలికారు. మొత్తం మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించడం గమనార్హం. 2009లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో దిండా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2010లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. కెరియర్‌లో మొత్తం 13 వన్డేలు ఆడిన దిండా, చివరిసారి 2013లో ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. 9 టీ20 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

2009లో ప్రారంభమైన అతడి అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ 2013లో ముగిసింది. అయితే, బెంగాల్ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం సుదీర్ఘకాలం కొనసాగాడు. 2019లో రంజీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ రణదేబ్ బోస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అతడిని పక్కన పెట్టింది. బోస్‌కు క్షమాపణలు చెబితే నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని క్యాబ్ అవకాశం ఇచ్చినప్పటికీ చెప్పేందుకు దిండా నిరాకరించాడు. 

దిండా బెంగాల్ తరపున 116 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 420 వికెట్లు పడగొట్టాడు. 98 లిస్ట్-ఎ మ్యాచులు ఆడి 151 వికెట్లు సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గత నెల గోవాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో దిండా ఆడాడు.