Ashes 2021-22: ఆస్ట్రేలియా జట్టు చేతుల్లో ఇంగ్లాండ్ 146 పరుగుల తేడాతో చిత్తు.. 4-0 తేడాతో యాషెస్ సిరీస్ సొంతం...

యాషెస్ 2021-22 సిరీస్ ఏ మాత్రం మజా లేకుండానే ముగిసింది. నాలుగో టెస్టు డ్రా చేసుకోవడం మినహా మిగిలిన నాలుగు టెస్టుల్లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శనతో ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు కనీస పోరాటం చూపించకుండానే చేతులేత్తేసింది. హోబర్ట్‌ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు చేతుల్లో ఇంగ్లాండ్ 146 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 303 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ జట్టు 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 115 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది... డేవిడ్ వార్నర్ డకౌట్ కాగా, ఉస్మాన్ ఖవాజా 11 పరుగులు చేయగా, మార్నస్ లబుషేన్ 5, స్టీవ్ స్మిత్ 27 పరుగులు చేశాడు...

బోలాండ్ 8, ట్రావిస్ హెడ్ 8 పరుగులు చేసి అవుట్ కావడంతో 63 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఈ దశలో అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్ కలిసి ఏడో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 47 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్‌ను స్టువర్ట్ బ్రాడ్ అవుట్ చేయగా అలెక్స్ క్యారీ 88 బంతుల్లో 4 ఫోర్లతో 49 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 33 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 6 వికెట్లు తీయగా, స్టువర్ట్ బ్రాడ్‌కి మూడు వికెట్లు దక్కాయి. క్రిస్ వోక్స్ ఓ వికెట్ తీశాడు. 270 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. రోరీ బర్న్స్,జాక్ క్రావ్లే కలిసి తొలి వికెట్‌కి 68 పరుగులు జోడిచారు. రోరీ బర్న్స్ అవుట్ కావడంతో మొదలైన వికెట్ల పతనానికి ఏ దశలోనూ బ్రేక్ పడలేదు...

46 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన రోరీ బర్స్న్, 66 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసిన జాక్ క్రావ్లీలను కామెరూన్ గ్రీన్ అవుట్ చేశాడు. డేవిడ్ మలాన్ 10, జో రూట్ 11, బెన్ స్టోక్స్ 5, ఓల్లీ పోప్ 5, సామ్ బిల్లింగ్స్ 1, మార్క్ వుడ్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు...

56 పరుగుల తేడాతో 10 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ సిరీస్‌లో 2 సెంచరీలతో 357 పరగులు చేసిన ట్రావిస్ హెడ్‌ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలిచాడు...

2013 నుంచి ఆస్ట్రేలియాలో 15 టెస్టులు ఆడిన ఇంగ్లాండ్ జట్టు, 13 మ్యాచుల్లో ఓడి, రెండు మ్యాచులను డ్రా చేసుకోగలిగింది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో 9 టెస్టులు ఆడిన ఇంగ్లాండ్ జట్టు, ఓ టెస్టు మాత్రమే గెలిచి ఆరింట్లో ఓడి, రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్, ఫైనల్‌కి అర్హత సాధించాలంటే అద్భుత ఆటతీరుతో మిగిలిన 12 మ్యాచులన్నింటీని గెలవాల్సిందే...