ఇంగ్లాండ్ గడ్డపై వరల్డ్ కప్  టోర్నీ ఎంత రసవత్తరంగా సాగిందో  అదే స్ధాయిలో యాషెస్ సీరిస్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఆతిథ్య ఇంగ్లాండ్, పర్యాటక ఆస్ట్రేలియా జట్లు ఈ ప్రతిష్టాత్మక సీరిస్ ను గెలుచుకోవాలని తహతహలాడుతున్నాయి. అయితే ఇప్పటికే మొదటి టెస్ట్ గెలుచుకుని మంచి ఊపుమీదున్న ఆసిస్ కు రెండో టెస్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టెస్ట్ వరుస ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డాడు. 

రెండో  టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో స్మిత్ 80 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్చర్ విసిరిన బంతి 149కిమీ ల వేగంతో వచ్చి స్మిత్ మెడ  భాగంలో బలంగా తాకింది. ఎలాంటి రక్షణలేని ప్రాంతంలో బంతి తగలడంతో స్మిత్ విలవిల్లాడిపోయాడు. మైదానంలోనే కుప్పకూలడంతో కాస్సేపు ఆందోళన  కొనసాగింది. అయితే కాస్సేపటి తర్వాత స్మిత్ లేచి రిటైర్ట్ హాట్ గా మైదానాన్ని వీడాడు.

అయితే స్మిత్ గాయంతో కుప్పకూలిన క్షణాలను తలచుకుంటేనే వణుకు పుడుతోందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అన్నాడు. '' అతడు గాయపడి కుప్పకూలిన  వెంటనే మేమంతా అతడి చుట్టూ చేరాం. నొప్పితో విలవిల్లాడుతున్న స్మిత్ ను చూసి తట్టుకోలేకపోయాం. ప్రథమ చికిత్స అనంతరం అతడు కోలుకుని పైకి లేచాకే మాలో ఆందోళన తగ్గింది. ఈ గాయం నుండి స్మిత్ త్వరగా కోలుకుని మళ్లీ బరిలోకి దిగాలని నేనొక్కడినే కాదు మా జట్టు సభ్యులంతా కోరుకుంటున్నారు.'' అని రూట్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. 

ఇక రెండో టెస్ట్ డ్రాగా ముగియడం గురించి కూడా రూట్ స్పందించాడు.ఈ టెస్ట్ లో ఆసిస్ బ్యాటింగ్ లైనప్ ని ఇబ్బందిపెట్టగలిగాం కానీ విజయాన్ని అందుకోలేకపోయామన్నాడు. ముఖ్యంగా యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన  పదునైన బంతులతో చెలరేగి మంచి ప్రదర్శన చేశాడని  కొనియాడాడు. తమ పేస్ విభాగం ఆర్చర్  రాకతో మరింత  బలోపేతమయ్యిందని రూట్ పేర్కొన్నాడు.