స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ లో ఇంగ్లాండ్ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టెస్ట్ ఆరంభమైన మొదటి రోజే ఇంగ్లీష్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గాయానికి లోనయ్యాడు. అతడు బౌలింగ్ చేయడానికి వేగంగా పరుగెత్తుతున్న సమయంలో కుడికాలి కండరాలు పట్టేశాయి. దీంతో నొప్పితో విలవిల్లాడిపోయిన అతడు మైదానాన్ని వీడాడు. ఇలా అతడు మొదటిరోజు ఆటకు దూరమయ్యాడు. 

అయితే అతడి గాయంపై ఇంగ్లాండ్ టీం మేనేజ్ మెంట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అతడు మళ్లీ మైదానంలో అడుగుపెడతాడా...లేక ఈ సీరిస్ కు దూరమవుతాడా...అన్న అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఒకవేళ ఈ గాయం కారణంగా అతడు యాషెస్ సీరిస్ కు దూరమైతే ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తాకినట్లే. 

అండర్సన్ పూర్తి ఫిటినెస్ తో లేకుండానే ఈ మ్యాచ్ లో పాల్గొన్నాడని అతడి  సహచరుడు స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు. కొద్దిరోజుల క్రితమే కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో అతడికి గాయమైంది. ఈ గాయం నుండి పూర్తిగా కోలుకోకముందే ఈ  సీరిస్ లో ఆడటానికి అతడు సిద్దపడ్డాడు. దీంతో ఆ గాయం తిరగబెట్టి అతడు మైదానాన్ని వీడాడని బ్రాడ్ తెలిపాడు.  

ఇలా అండర్సన్ కేవలం 4  ఓవర్లపాటు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. అయితే నాలుగింట్లో మూడు మెయిడెన్లు కాగా మిగతా  ఓవర్లో  ఒక్క పరుగు మాత్రమే సమర్పించుకున్నాడు. అండర్సన్ దూరమైనప్పటికి మొదటి టెస్ట్ మొదటి రోజు ఇంగ్లీష్ బౌలర్ల హవానే కొనసాగింది. స్టువర్ట్ బ్రాడ్ 5  వికెట్లతో ఆసిస్ బ్యాటింగ్ లైనప్ ను  కోలుకోలేని దెబ్బతీయగా వోక్స్ 3, స్టోక్స్ 1, మోయిన్ అలీ 1 వికెట్ పడగొట్టారు. దీంతో ఆసిస్ కేవలం 284 పరుగులకే కుప్పకూలింది. కేవలం 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆసిస్ ను స్మిత్(144 పరుగులు), సిడ్డిల్ (44 పరుగులు) లు ఆదుకున్నారు.  

సంబంధిత వార్తలు

సచిన్, కోహ్లీల రికార్డు బద్దలు...బ్రాడ్ మన్ తర్వాత ఆ ఘనత స్మిత్‌దే