ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ ఆరంభమే చాలా అద్భుతంగా సాగింది. నిన్న(గురువారం)  మొదలైన  మొదటి టెస్ట్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తడబాటుతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం తర్వాత మొదటి టెస్ట్ ఆడుతున్న స్టీవ్ స్మిత్ ఆసిస్ ను ఆదుకున్నాడు. అతడు అద్భుత సెంచరీతో రాణించడంతో మొదటిరోజు  ఆసిస్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. 

తన సెంచరీ ద్వారా స్మిత్ కేవలం జట్టును ఆదుకోవడమే కాదు వ్యక్తిగతంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 24వ టెస్ట్ సెంచరీని పూర్తిచేసుకున్న స్మిత్ ఆసిస్ దిగ్గజం బ్రాడ్ మన్ తర్వాతిస్థానంలో నిలిచాడు. బ్రాడ్ మన్ కేవలం 66  టెస్టుల్లోనే ఈ  మైలురాయిని అధిగమించగా స్మిత్ మాత్రం 118 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించాడు.

ఇదేక్రమంలో  స్మిత్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీలను కూడా అధిగమించాడు. సచిన్ కు 24 సెంచరీలు సాధించడానికి 123 ఇన్నింగ్సులు ఆడితే కోహ్లీ 125 ఇన్నింగ్సుల్లో సాధించాడు. తాజా  శతకంతో స్మిత్ వీరిద్దరిని కూడా వెనక్కినెట్టి రికార్డు సృష్టించాడు. 

ఇక ఇంగ్లాండ్-ఆసిస్ మధ్య మొదలైన ఫస్ట్ టెస్ట్ మొదటిరోజే ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లీష్ బౌలర్ దాటికి వార్నర్ 2, బాన్ క్రాఫ్ట్ 8, ఖవాజా 13 పరుగులకే పెవిలియన్ కు చేరిన సమయంలో స్మిత్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో వికెట్ ను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేశాడు. ఇలా 122  పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన స్థాయి నుండి 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముంగించేవరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే  అతడు కూడా అద్భుత సెంచరీ(144 పరుగులు) సాధించి 24వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం యాషెస్ సీరిస్ లోనే స్మిత్ 9 సెంచరీలు సాధించడం విశేషం.