ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సీరిస్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ సీరిస్ ఆరంభం నుండి స్థానిక జట్టుపై వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్న స్మిత్ పలు రికార్డులను కూడా బద్దలుగొడుతున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండిస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 1976లో నెలకొల్పిన ఓ అరుదైన టెస్ట్ రికార్డుకు స్మిత్ చేరువయ్యాడు. గత మ్యాచుల మాదిరిగా అతడు చెలరేగితే ఈ రికార్డు బద్దలవడం ఖాయం. 

ఐదు మ్యాచ్ ల టెస్ట్ సీరిస్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు వివ్ రిచర్డ్స్ పేరిట వుంది. 1976లో వెస్టిండిస్-ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన టెస్ట్ సీరిస్ లో రిచర్డ్స్  చెలరేగిపోయాడు. ఐదు మ్యాచుల సీరిస్ లో కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే ఆడిన అతడు 829 పరుగులు సాధించాడు. అప్పటినుండి ఈ  రికార్డు అతడి పేరిటే వుంది. 

తాజాగా యాషెస్ సీరిస్ ప్రదర్శన ద్వారా స్మిత్ ఆ రికార్డుకు చేరువయ్యాడు. ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడిన అతడు 134 సగటుతో 671 పరుగులు బాదాడు. స్మిత్ ఇదే ఊపు కొనసాగిస్తే 43ఏళ్లుగా ఎవరూ టచ్ చేయలేకకపోయిన రిచర్డ్స్ రికార్డును బద్దలుగొట్టే అవకాశముంది.  

ఈ జాబితాలో స్మిత్ ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచాడు. అతడికంటే ముందు 774 పరుగులతో సునీల్ గవాస్కర్, 752 పరుగులతో గ్రాహం  గూచ్, 688 పరుగులతో లారా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. స్మిత్ మరో 159 పరుగులు బాదితే వీరందరిని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకోనున్నాడు.