Ashes 2023: ఏడాదికాలంగా ‘బజ్‌బాల్’ మంత్రంతో విజయాల ఊపులో ఉన్న బెన్ స్టోక్స్ సేనకు టెస్టులలో వరల్డ్ ఛాంపియన్లుగా ఉన్న ఆస్ట్రేలియన్లు ఓటమి రుచి చూపించారు.
యాషెస్ తొలి టెస్టుకు ఘనమైన ముగింపు. ఇంగ్లాండ్ దూకుడుకు కళ్లెం వేస్తూ ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఏడాదికాలంగా ‘బజ్‌బాల్’ మంత్రంతో విజయాల ఊపులో ఉన్న బెన్ స్టోక్స్ సేనకు వరల్డ్ ఛాంపియన్లు ఓటమి రుచి చూపించారు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిన్న ముగిసిన తొలిటెస్టులో ఆస్ట్రేలియానే 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నాథన్ లియన్ (28 బంతుల్లో 16 నాటౌట్, 2 ఫోర్లు) లు అద్భుతంగా పోరాడారు. 8 వికెట్లు తీసి పోటీలోకి వచ్చిన ఇంగ్లాండ్.. 2 వికెట్లు తీయలేక నానా తంటాలు పడి ఓటమిని కొనితెచ్చుకుంది.
280 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ కు ఐదో రోజు కష్టాలు తప్పలేదు. ఐదో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఉదయపు ఆట వర్షార్పణం అయింది. లంచ్ తర్వాత ఆసీస్ లక్ష్యం 67 ఓవర్లకు 174 పరుగులు చేయాల్సిందిగా మారింది. చేతిలో ఏడు వికెట్లు ఉండటంతో ఆసీస్ విజయంపై ధీమాగానే ఉంది.
107-3 ఓవర్ నైట్ స్కోరు వద్ద ఐదో రోజు బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్ ను బ్రాడ్ తొలి దెబ్బ తీశాడు. నైట్ వాచ్‌మెన్ స్కాట్ బొలాండ్ (20) ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఇదే ఊపులో ఇంగ్లాండ్ వెటరన్ స్పిన్నర్ ఆసీస్ కీ ప్లేయర్ ట్రావిస్ హెడ్ (16) ను పెవిలియన్ కు పంపాడు. కామెరూన్ గ్రీన్ (28) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు.
ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా ఓపికగా క్రీజులో నిలబడ్డ ఉస్మాన్ ఖవాజా (197 బంతుల్లో 65, 7 ఫోర్లు) ఉండటంతో ఆసీస్ విజయం మీద నమ్మకంగానే ఉంది. అలెక్స్ కేరీ (20) కూడా ఉండటంతో ఆ జట్టు విజయానికి ఢోకా లేదనిపించింది. కానీ ఖవాజాను స్టోక్స్ బౌల్డ్ చేయడం.. కేరీని రూట్ ఔట్ చేయడంతో సీన్ రివర్స్ అయింది. ఆసీస్.. 227 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది.
పోరాడిన కమిన్స్..
కంగారూల విజయానికి 53 పరుగులు కావాలి. ఓవర్లకు కొదవలేదు. కానీ క్రీజులో ఉన్నది, కాస్తో కూస్తో బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది కమిన్స్ ఒక్కడే. నాథన్ లియన్, జోష్ హెజిల్వుడ్ ఉన్నా వాళ్లు టెయిల్ ఎండర్లే. కానీ కమిన్స్ మాత్రం అద్భుతం చేశాడు. లియాన్ తో కలిసి ఆసీస్‌ను విజయం వైపునకు తీసుకెళ్లాడు. పట్టుదలగా క్రీజులో తాను నిలబడ్డాడు. కమిన్స్ కు లియాన్ కూడా చక్కటి సహకారం అందించాడు. బెన్ స్టోక్స్ బౌలర్లను, తన వ్యూహాలను మార్చి మార్చి ప్రయోగించినా ఈ జోడీ వెరువలేదు. మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను శిక్షిస్తూ వడివడిగా లక్ష్యం దిశగా సాగింది. ఇక ఆట మరో నాలుగు ఓవర్లలో ముగుస్తుందనగా రాబిన్సన్ వేసిన 93 వ ఓవర్లో కమిన్స్.. స్లిప్స్ లో ఫోర్ కొట్టి ఆసీస్ విజయాన్ని ఖాయం చేశాడు.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ : 393-8, 273
ఆస్ట్రేలియా : 386, 282-8
