Asianet News TeluguAsianet News Telugu

అలీ.. మీ సేవలు మాకు మళ్లీ కావాలి..! రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమంటూ స్పిన్నర్‌ను కాకా పడుతున్న ఇంగ్లాండ్

Ashes 2023: త్వరలో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ ముంచుకొస్తున్న వేళ.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)  వెటరన్  స్పిన్నర్ మోయిన్ అలీని కాకా పడుతోంది. 

Ashes 2023: After Jack Leach Injury, England Asked Moeen ali to comeback from Test retirement MSV
Author
First Published Jun 6, 2023, 2:14 PM IST

ఈనెల 16 నుంచి  ఆస్ట్రేలియాతో  యాషెస్ సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో  ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. వెటరన్ స్పిన్నర్ మోయిన్ అలీని రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరుతోంది. ఈ మేరకు ఇంగ్లాండ్ రెడ్ బాల్ కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్‌కోచ్  బ్రెండన్ మెక్‌కల్లమ్‌లు  అలీని ఒప్పించే పనిలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి.  2021లో భారత్ తో ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత అలీ.. టెస్టుల నుంచి తప్పుకుని  పరిమిత ఓవర్ల క్రికెట్ కే పరిమితమయ్యాడు. 

కాగా  అలీని తిరిగి ఇంగ్లాండ్ టీమ్‌లోకి పిలవడానికి కారణం లేకపోలేదు. ఆ జట్టు ప్రధాన స్పిన్నర్  జాక్ లీచ్.. గాయంతో  యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ కు మెయిన్ స్పిన్నర్ లేకుండా పోయాడు. దీంతో  ఈసీబీ.. అలీ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాల్సిందిగా  కోరుతోంది. 

టెస్టుల నుంచి తప్పుకున్నా అలీ ఇంకా ఇంగ్లాండ్ తరఫున టీ20, వన్డేలు ఆడుతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ -16   లో కూడా అలీ.. చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ వెటరన్ స్పిన్ ఆల్ రౌండర్  జట్టులోకి వస్తే ఇప్పటికే స్ట్రాంగ్ గా ఉన్న ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ మరింత దృఢమవుతుంది. స్పిన్ ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడే కంగారూలకు  అలీ మరింత కంగారెత్తించగలడని ఈసీబీ,  బజ్‌బాల్ ద్వయం (స్టోక్స్, మెక్‌కల్లమ్) భావిస్తోంది.  మరి  ఈ   ప్రతిపాదనను  అలీ ఒప్పుకుంటాడా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మోయిన్ అలీ  తన  కెరీర్ లో  64 టెస్టులు ఆడి 2,914 పరుగులు  సాధించాడు.  ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్ లో అలీ.. 195 వికెట్లు పడగొట్టడం విశేషం.

 

ఐర్లాండ్ తో ఇటీవలే ముగిసిన ఏకైక టెస్టులో  ఆడిన లీచ్.. ఆదివారం  వెన్నునొప్పికోసమని పరీక్షలు చేయించుకోగా అతడికి నడుము కింది భాగంలో గాయమైనట్టు తేలింది. దీంతో అతడు  యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. స్టోక్స్ నాయకత్వంలో లీచ్ దూసుకుపోతున్నాడు. గత ఏడాది కాలంలో  లీచ్.. ఏకంగా 46 వికెట్లు పడగొట్టి జోరు మీదున్నాడు. ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ లో పర్యటించినప్పుడు లీచ్.. ఇక్కడి జీవం లేని పిచ్ పై మంచి టర్న్ రాబట్టాడు.   

యాషెస్ సిరీస్ షెడ్యూల్ : 

మొదటి టెస్టు : జూన్ 16 - 20 - ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్) 
రెండో టెస్టు : జూన్ 28 -  జులై 2 - లార్డ్స్ (లండన్) 
మూడో టెస్టు : జులై 6 - 10  - హెడింగ్లీ (లీడ్స్) 
నాలుగో టెస్టు : జులై 19 - 23 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్) 
ఐదో టెస్టు : జులై 27 - 31  - కియా ఓవల్ (లండన్) 

Follow Us:
Download App:
  • android
  • ios