Australia Vs England: రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే కీలక పేసర్ దూరమై ఇబ్బందులు పడుతున్న ఆ జట్టు.. తాజాగా కెప్టెన్ సేవలను కూడా కోల్పోయింది.
కీలకమైన యాషెస్ సిరీస్ లో ఆతిథ్య ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు పేసర్ జోష్ హెజిల్వుడ్ కు గాయం కావడంతో అతడు రెండో టెస్టు నుంచి వైదొలగగా.. తాజాగా ఆ జట్టు సారథి పాట్ కమిన్స్ కూడా దూరమయ్యాడు. కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలగడంతో అతడిని ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో గడపాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది. కమిన్స్ దూరమవడంతో.. సుమారు మూడున్నరేండ్ల క్రితం క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయే ఘటనతో ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ గా దిగిపోయిన స్టీవ్ స్మిత్.. మళ్లీ సారథ్య పగ్గాలు చేపట్టాడు.
అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకు కొద్ది సేపటి ముందే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. పింక్ బాల్ టెస్టుకు ముందు డిన్నర్ కోసమని రెస్టారెంట్ కు వెళ్లిన కమిన్స్.. అక్కడ కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో అతడిని ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో గడపాలని క్రికెట్ ఆస్ట్రేలియ ఆదేశించింది. దీంతో ఈ సిరీస్ కు ముందు ఆసీస్ వైస్ కెప్టెన్ గా నియమితుడైన స్టీవ్ స్మిత్.. రెండో టెస్టు వరకు ఆ జట్టుకు సారథ్య బాధ్యతలు మోయనున్నాడు.
కమిన్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో అతడికి నెగిటివ్ వచ్చింది. అతడి స్థానంలో మైఖెల్ నెసర్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇదిలాఉండగా.. రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మార్కస్ హరిస్ (3) త్వరగానే ఔటవ్వగా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (20 నాటౌట్), మార్కస్ లబూషేన్ (16 నాటౌట్) క్రీజులో నిలకడగా ఆడుతున్నారు. తొలి సెషన్ లో 25 ఓవర్లు ముగిసేసిరికి ఆసీస్.. ఒక వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది. ఇంతవరకు ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్టులలో ఓడిపోలేదు. ఆ జట్టు ఇప్పటిదాకా 8 డే అండ్ నైట్ టెస్టులు ఆడగా.. అందులో 8 గెలిచింది.
స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత :
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. ఇది అతడికి 150వ టెస్టు మ్యాచ్. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో జేమ్స్ అండర్సన్ (168 టెస్టులు), అలెస్టర్ కుక్ (161) తర్వాత సుదీర్ఘకాలంగా టెస్టులు ఆడిన ఘనతను బ్రాడ్ దక్కించుకున్నాడు. మొత్తంగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో 150 కు పైగా టెస్టులు ఆడిన వారి జాబితాలో బ్రాడ్ పదో వ్యక్తి. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్.. 200 టెస్టులతో అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. 164 టెస్టులాడాడు.
