Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల మహారాణి అరినా సబలెంక.. ఫైనల్లో రిబాకినా ఓటమి

Australia Open 2023: రెండు వారాలుగా  మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ - 2023లో నేడు ముగిసిన మహిళల ఫైనల్స్  లో బెలారస్   టెన్నిస్ క్రీడాకారిణి అరినా సబలెంక.. తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ నెగ్గింది. 

Aryna Sabalenka Wins Maiden Australia Open 2023, Defeats Elean Rybakina MSV
Author
First Published Jan 28, 2023, 5:44 PM IST

ఆస్ట్రేలియా ఓపెన్ - 2023లో  మహిళల గ్రాండ్ స్లామ్ విజేతగా  బెలారస్  కు చెందిన   అరినా సబలెంక నిలిచింది.  శనివారం  మెల్‌‌బోర్న్ వేదికగా ముగిసిన మహిళల సింగిల్స్  విభాగంలో వరల్డ్ నెంబర్ టూ  ర్యాంక్  సబలెంక.. కజకిస్తాన్ కు చెందిన పదో ర్యాంకర్  రిబాకినాను ఓడించి తన  కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను   గెలుచుకుంది. ఫైనల్ లో  సబలెంక.. 4-6,  6-3, 6-4 తేడాతో  రిబాకినాను  ఓడించింది.   రెండు గంటల  28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో  మూడు సెట్ లు జరుగగా.. తొలి సెట్ కోల్పోయినా సబలెంక.. తర్వాత పుంజుకుని  జయభేరి మోగించింది.

మెల్‌బోర్న్ లోని ప్రతిష్టాత్మక రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన ఈ పోరులో  సబలెంక తొలి సెట్ లో  4-6 తో వెనుకబడింది. ఈ సీజన్ లో ఆమె ఒక సెట్ ను కోల్పోవడం కూడా ఇదే తొలిసారి.   కానీ తర్వాత  ఈ బెలారస్  స్టార్ పుంజుకుంది.  రెండో సెట్ నుంచి రిబాకినాకు చుక్కలు చూపించింది. 

తన అనుభవాన్నంతా ఉపయోగించి బలమైన  సర్వీస్ షాట్లు,  ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో   రిబాకినాపై విరుచుకుపడింది.  సబలెంక దూకుడుకు 23 ఏండ్ల కజకిస్తాన్ చిన్నది రిబాకినా  వెనుకడుగు వేయక తప్పలేదు.  రెండు, మూడో సెట్ ను గెలుచుకుని   తన తొలి మేజర్ టైటిల్ ను సొంతం చేసుకుంది. రిబాకినా  రన్నరప్ గా నిలిచింది. 

 

కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ గెలిచిన తర్వాత  సబలెంక కొద్దిసేపు తాను ఆడుతున్న టెన్నిస్ కోర్టులోనే కింద పడిపోయి  భావోద్వేగానికి గురైంది. తన కోచింగ్ సిబ్బంది,  కుటుంబసభ్యులు కూడా  సబలెంకను అనుసరించారు. సబలెంక తనివితీరా  ఏడ్చి.. అనంతరం ప్రత్యర్థిని  కౌగిలించుకుంది. ఇక ఈ టోర్నీలో సంచలన విజయాలతో ఫైనల్ చేరిన కజకిస్తాన్ అమ్మాయి రిబాకినా.. ఈ క్రమంలో  ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ ను క్వార్టర్స్ లో ఓడించిన విషయం తెలిసిందే.  అయితే ఆమె ఫైనల్ లో మాత్రం  సబలెంకకు తలవంచక తప్పలేదు.  మహిళల సింగిల్స్ కూడా ముగియడంతో ఇక రేపు (ఆదివారం) పురుషుల ఫైనల్స్ జరుగనుంది.  సెర్బియా స్టార్ నొవాక్ జకొవిచ్.. గ్రీస్ కుర్రాడు సిట్సిపాస్ మధ్య రేపటి తుది పోరు జరుగనుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios