INDvsAUS Test: ఢిల్లీ టెస్టులో భారత విజయానికి  ముఖ్య కారకులు  రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్. ఈ స్పిన్ త్రయం అటు బౌలింగ్ తో పాటు ఇటు బ్యాటింగ్ లోనూ రాణించి భారత్ కు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  సూపర్ విక్టరీని కట్టబెట్టింది.  

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలంతో ఢిల్లీ టెస్టులో భారత జట్టు బంపర్ విక్టరీ కొట్టింది. ఈ టెస్టులో జడేజాతో పాటు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్, కోహ్లీ, పుజారా, శ్రేయాస్ వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట రవిచంద్రన్ అశ్విన్ తో కలిసి అక్షర్ పటేల్ అద్భుతమే చేశాడు. ఆస్ట్రేలియా స్పిన్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కుని భారత్ ను పోటీలోకి తెచ్చాడు. ఢిల్లీ టెస్టు విజయంలో ఈ ఇద్దరిదీ కీలక పాత్ర. 

ఈ ఇద్దరూ ఢిల్లీ టెస్టు ముగిశాక మ్యాచ్ గురించి ముచ్చటించుకున్నారు. జడేజా వల్ల తనకు బౌలింగ్ చేసే అవకాశం దక్కడం లేదని అక్షర్ వాపోయాడు. దానికి జడ్డూ కూడా సాలిడ్ రిప్లై ఇచ్చాడు. అక్షర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూస్గే ఆసీస్ బౌలర్లు మరీ ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నారా అనిపించిందని తెలిపాడు. 

ఢిల్లీ టెస్టు ముగిసిన తర్వాత బీసీసీఐ టీవీలో అక్షర్.. జడేజాను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అక్షర్ జడేజా తో.. ‘ప్రస్తుతం మనతో సర్ రవీంద్ర జడేజా ఉన్నారు. సర్.. మీరు ఇంత బాగా బౌలింగ్ చేసేసరికి రోహిత్ భాయ్ నాకు బంతిని ఇవ్వడంలేదు. మీరు ఇలాగే బౌలింగ్ చేస్తే నాకు బౌలింగ్ వేసే అవకాశం దక్కేట్టు లేదు..’అని ఫన్నీగా అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరబూశాయి. అప్పుడు జడ్డూ.. ‘వాళ్లు (ఆస్ట్రేలియా) నా బౌలింగ్ లో స్వీప్, రివర్స్ స్వీప్ ఆడతారని నాకు తెలుసు. అందుకే నేను స్టంప్స్ ను లక్ష్యంగా చేసుకున్నా. ఒకవేళ వాళ్లు మిస్ అయ్యారో నాకు ఛాన్స్ దొరుకుతుంది. ఇవాళ జరిగింది కూడా అదే.. ఐదు సార్లు నా బాల్స్ స్టంప్స్ ను తాకాయి...’అని చెప్పాడు. 

ఇక ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 139 పరుగులకే భారత్ 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా అక్షర్ పటేల్ (74), అశ్విన్ (37) లు 8వ వికెట్ కు 114 పరుగులు జోడించిన విషయం తెలిసిందే. అక్షర్ నాగ్‌పూర్ టెస్టులో రవీంద్ర జడేజాతో కలిసి రాణించాడు. జడ్డూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జడ్డూ.. ‘నువ్వు బౌలింగ్ చేయకుంటే ఫర్వాలేదులే గానీ నువ్వు బ్యాటింగ్ చేస్తుంటే ఆస్ట్రేలియా బౌలింగ్ అంత నాసిరకంగా ఉందా అనిపించింది. ఇటువంటి పిచ్ పై మన టాపార్డర్ బ్యాటర్లు తడబడ్డ చోటు నువ్వు అంత ఈజీగా ఎలా బ్యాటింగ్ చేశావ్. ఆ సీక్రెట్ ఏదో నాక్కూడా చెప్పు..?’అని ప్రశ్నించాడు. 

Scroll to load tweet…

దానికి అక్షర్ నవ్వుతూ.. ‘అందులో పెద్ద రహస్యమేమీ లేదు. నువ్వే చెప్పావ్ గా రివర్స్ స్వీప్, స్వీప్ ల జోలికి పోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్లా.. అంతే.’అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.