Sarfaraz Khan: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇటీవలే ఎంపిక చేసిన టెస్టు జట్టులో ముంబై  బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు  స్పందించారు. 

త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు.. ఈ టూర్‌లో టెస్టులు, వన్డేలుకు జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో పుజారాను తప్పించిన సెలక్టర్లు మరోసారి దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న ముంబై సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌కు మొండిచేయి చూపారు. అతడికి బదులు మరో ముంబై బ్యాటర్ యశస్విజైస్వాల్, పూణె బ్యాటర్ రుతరాజ్ గైక్వాడ్‌కు చోటు కల్పించారు. ఈ ఇద్దరూ సర్ఫరాజ్ కంటే తక్కువ యావరేజీ కలిగినోళ్లే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. విమర్శల దాడి పెరుగుతుండటంతో బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఈ వ్యవహారంపై స్పందించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలు వెల్లడించాడు. 

మేమేమైనా పిచ్చోళ్లమా...? 

సర్ఫరాజ్ ను ఎంపిక చేయకపోవడంపై సదరు బీసీసీఐ అధికారి వివరణ ఇస్తూ... ‘దేశవాళీలో నిలకడగా ఆడుతూ మూడు సీజన్లుగా 900 కు పైగా పరుగులు చేసిన ఆటగాడిని జాతీయ జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి సెలక్టర్లు ఏమైనా పిచ్చోళ్లా..? అతడి (సర్ఫరాజ్)ని ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం ఫిట్నెస్ ఒకటి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అతడి ఫిట్నెస్ లేదు. దానిమీద అతడు దృష్టి పెట్టాలి. బరువు తగ్గి ఫిట్నెస్ మెరుగుపరుచుకోవాలి.. 

రెండోది. సర్ఫరాజ్ ఖాన్ ఆఫ్ ఫీల్డ్ వ్యవహారాలు. సెంచరీ చేశాక తొడ కొట్టడాలు, బిగ్గరగా అరవడాలు.. చిత్ర విచిత్ర విన్యాసాలు.. ఇవన్నీ ఎవరికి..? ఆటగాళ్లకు క్రమశిక్షణ ముఖ్యం. అతడిలో ప్రస్తుతం అదే కొరవడింది. సర్ఫరాజ్ ను సెలక్టర్లు ప్రతీసారి ఇగ్నోర్ చేయడానికి కూడా అదే ప్రధాన కారణం. సర్ఫరాజ్ ను తీసుకోకపోవడానికి అతడి ఆట ఒక్కటే కాదు. ఆటేతర విషయాలు కూడా ఉన్నాయి..’ అని కుండబద్దలు కొట్టాడు. 

సర్ఫరాజ్ ఏం చేశాడు..? 

బీసీసీఐ అధికారి చెప్పినదాంట్లో నిజం లేకపోలేదు. సర్ఫరాజ్ కాస్త బొద్దుగా ఉన్న మాట వాస్తవమే. అయితే దీనికంటే అతి ముఖ్యమైంది అతడి వ్యవహార శైలి. ఈ ఏడాది రంజీ సీజన్ లో ఢిల్లీతో మ్యాచ్ ఆడుతూ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేయగానే ఆవేశంగా తొడ కొడుతూ.. చేతి పైకెత్తి ‘ఇది నీకే.. చూడు నా ఆట’ అన్నట్టుగా డగౌట్ వైపు చూపిస్తూ సైగలు చేశాడు. అక్కడ బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ ఉన్నాడు. ఇది బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. 

అంతేగాక అతడిని బంగ్లాదేశ్ తో గతేడాది డిసెంబర్ లో జరిగిన టెస్టు సిరీస్ లో ఎంపిక చేయకపోవడంతో ఓ యూట్యూబ్ ఛానెల్ లో సెలక్టర్లను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఎంపిక కాకపోవడంతో ఇన్‌స్టాలో బీసీసీఐని టార్గెట్ చేస్తూ పోస్టులు, వీడియోలు పెట్టడం వంటివి బోర్డుకు ఆగ్రహం తెప్పించాయి. ఈ కారణాలతోనే సర్ఫరాజ్ కు పదే పదే నిరాశే ఎదురవుతున్నది. మరి బీసీసీఐ మాటను సర్ఫరాజ్ ఇకనుంచైనా వింటూ బోర్డుకు, సెలక్టర్లకు విధేయంగా ఉంటాడా..? అన్నది కాలమే నిర్ణయించనుంది.