Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాతో టెస్టు సిరీస్‌కి ముందు సౌతాఫ్రికాకి గట్టి షాక్... గాయంతో అన్రీచ్ నోకియా దూరం...

కొన్నాళ్లుగా చేతి వేలి గాయంతో బాధపడుతున్న అన్రీచ్ నోకియా... పూర్తిగా కోలుకోకపోవడంతో ఇండియాతో టెస్టు సిరీస్ నుంచి నోకియాకి విశ్రాంతి కల్పించిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు...

Anrich Nortje ruled out of India vs South Africa Test Series with Injury
Author
India, First Published Dec 21, 2021, 3:47 PM IST

ఇండియాతో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతున్న సౌతాఫ్రికాకి ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో అన్రీచ్ నోకియా పాల్గొనడం లేదని తెలియచేసింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు... సౌతాఫ్రికా జట్టుకి కీ బౌలర్‌గా ఉన్న అన్రీచ్ నోకియా,  ఇప్పటిదాకా తన కెరీర్‌లో 12 టెస్టులు ఆడి 47 వికెట్లు తీశాడు.

కెరీర్ ఆరంభం నుంచే అనేక గాయాలతో సతమతమవుతున్న నోకియా, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాడు. 154+ కి.మీ.ల వేగంతో బంతులు విసిరి, బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకుపుట్టించే నోకియా... టెస్టు టీమ్‌కి దూరం కావడం సౌతాఫ్రికాకి గట్టి దెబ్బే...

అన్రోచ్ నోకియా స్థానంలో ఏ ప్లేయర్‌ని రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించలేదు క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్‌ఏ). అలాగే సౌతాఫ్రికా వికెట్ కీపర్, ఓపెనర్ క్వింటన్ డి కాక్ కూడా ఇండియాతో జరిగే చివరి రెండు టెస్టులకి దూరంగా ఉండబోతున్నాడు. డి కాక్ భార్య శాసా, జనవరి మొదటి వారంలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. పెటర్నరీ లీవ్ తీసుకున్న డి కాక్, మొదటి టెస్టు ముగిసిన తర్వాత బయో బబుల్‌ని వీడి, భార్యను కలవబోతున్నాడు...

సెంచూరియన్‌లో డిసెంబర్ 26 నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 3, 2022 నుంచి జోహన్‌బర్గ్‌లో రెండో టెస్టు, జనవరి 11 నుంచి కేప్‌ టౌన్‌లో మూడో టెస్టు జరుగుతాయి. ఆ తర్వాత పార్ల్‌లో మొదటి రెండు వన్డే మ్యాచులు, కేప్ టౌన్‌లో మూడో వన్డే జరుగుతాయి...

1992 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌లు జరుగుతున్నాయి. అయితే ఈ సిరీస్‌లలో దక్షిణాఫ్రికాకే ఆధిక్యం ఉంది. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన 7 సార్లు దక్షిణాఫ్రికా జట్టు విజయాన్ని అందుకోగా, 4 సార్లు భారత జట్టుకి (స్వదేశంలో) సిరీస్ విజయం దక్కింది. మూడు సిరీస్‌లు డ్రాలుగా ముగిశాయి...

సౌతాఫ్రికా గడ్డపై మొత్తంగా సౌతాఫ్రికాలో భారత క్రికెటర్లు 14 సెంచరీలు చేస్తే, అందులో సచిన్ 5, విరాట్ కోహ్లీ 2 టెస్టు సెంచరీలు చేయగా ప్రవీన్ ఆమ్రే, కపిల్‌ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వసీం జాఫర్, ఛతేశ్వర్ పూజారా తలా ఓ సెంచరీ చేశారు.

సౌతాఫ్రికా గడ్డపై భారత జట్టు ఇప్పటిదాకా మూడు టెస్టు మ్యాచులు గెలిస్తే, ఒకటి 2006లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో కాగా, మరోటి 2010లో ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో గెలిచింది. గత పర్యటనలో మొదటి రెండు టెస్టుల్లో విజయం అంచుల దాకా వచ్చిన భారత జట్టు, మూడో టెస్టులో గెలిచి క్లీన్‌ స్వీప్ నుంచి తప్పించుకుంది.

రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ తర్వాత సౌతాఫ్రికా గడ్డ మీద టెస్టు మ్యాచ్ గెలిచిన భారత సారథిగా నిలిచాడు విరాట్ కోహ్లీ... ఈ సారి టెస్టు సిరీస్ గెలవడమే లక్ష్యంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది భారత జట్టు. 

Follow Us:
Download App:
  • android
  • ios