Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్.. ఊపిరి పీల్చుకో.. మరో ఉమ్రాన్ మాలిక్ వస్తున్నాడు.. పేసర్లకు స్వర్గధామంగా జమ్మూకాశ్మీర్

భారత జట్టు న్యూజిలాండ్ తో ఆడుతున్న సిరీస్ లో ఉమ్రాన్ మాలిక్ కూడా భాగమయ్యాడు. ఒక్క ఉమ్రాన్ కే మనం ఇంత సంతోషపడుతుంటే మరికొద్దిరోజుల్లో అలాంటి పేసర్లు పదులసంఖ్యలో రాబోతున్నారా..? అన్నట్టు మరో పేసర్ జమ్మూకాశ్మీర్ నుంచి దూసుకొస్తున్నాడు. 

Another Umran Malik Is Loading: Jammu and Kashmir Produces Fast Bowlers, Meet Waseem Bashir Who Bowls 145 kmph
Author
First Published Nov 20, 2022, 7:04 PM IST

భారత జట్టులో ప్రస్తుతం  అత్యంత వేగంగా బంతులు విసరగలిగే బౌలర్ ఎవరు..? అంటే  సందేహం లేకుండా గుర్తొచ్చే పేరు ఉమ్రాన్ మాలిక్. ఈ జమ్మూ కుర్రాడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి  గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంగా విసిరిన బంతులు భారత జట్టు అభిమానులతో పాటు  బీసీసీఐ పెద్దలను కూడా మెప్పించాయి. ఆనతి కాలంలోనే ఉమ్రాన్.. భారత సీనియర్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం  భారత జట్టు న్యూజిలాండ్ తో ఆడుతున్న సిరీస్ లో ఉమ్రాన్ కూడా భాగమయ్యాడు. అయితే ఒక్క ఉమ్రాన్ కే మనం ఇంత సంతోషపడుతుంటే మరికొద్దిరోజుల్లో అలాంటి  పేసర్లు పదులసంఖ్యలో రాబోతున్నారా..? అన్నట్టు మరో పేసర్ జమ్మూకాశ్మీర్ నుంచి దూసుకొస్తున్నాడు.  ఆ యువ సంచలనం పేరు వసీం బాషిర్. 

ఉమ్రాన్ మాదిరిగానే బాషిర్ కూడా పేసర్.   ప్రస్తుతానికి  గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు. వసీం స్పీడ్ చూసిన పలువురు.. 150 కూడా దాటడం పెద్ద కష్టమేమీ కాదు అంటున్నారు.   ప్రస్తుతం  జమ్మూకాశ్మీర్ అండర్ - 25 జట్టులో సభ్యుడిగా ఉన్న వసీం.. అవకాశమిస్తే తాను మరో ఉమ్రాన్ మాలిక్ అవడానికి సిద్ధంగా ఉన్నానని నిరూపిస్తున్నాడు. 

కాశ్మీర్ లోని పహల్గాం గ్రామానికి చెందిన వసీం బాషిర్ వయస్సు 22 ఏండ్లు.   తనదైన వేగంతో బాషిర్.. బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడు.  దేశవాళీలో జమ్మూకాశ్మీర్ తరఫున మెరుస్తున్న ఈ కుర్రాడి గురించి ప్రముఖ జర్నలిస్టు మోహ్సిన్ కమల్  తన ట్విటర్ ఖాతాలో   పరిచయం చేశాడు.  

మోహ్సిన్ ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘కాశ్మీర్ నుంచి మరో  ఉమ్రాన్ మాలిక్..  ఇది చూస్తుంటే బహుశా జమ్మూకాశ్మీర్ లో మరికొంతమంది ఉమ్రాన్ మాలిక్ లు ఉన్నట్టే అనిపిస్తున్నది. ఇదిగో ఈ కుర్రాడి పేరు వసీం బాషిర్.  22 ఏండ్ల ఈ కాశ్మీరి కుర్రాడు  గంటకు  145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు.  అంతకంటే ఎక్కువవేగం కూడా సంధించగల  సమర్థుడు. తన బౌలింగ్ తో  బ్యాటర్లకు చుక్కలు చూపెడుతున్నాడు.  ప్రస్తుతానికి జమ్మూకాశ్మీర్ అండర్-25 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.   ఐపీఎల్ ఫ్రాంచైజీలూ.. కొంచెం ఇటు చూడండి..’ అని ట్వీట్ చేశాడు.  

 

బాషిర్ కు సంబంధించిన వీడియో షేర్ చేయగానే సోషల్ మీడియా వేదికగా పలువురు  నెటిజన్లు  అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాషిర్ బౌలింగ్ శైలి   వెస్టిండీస్ దిగ్గజం కోట్నీ వాల్ష్ ను పోలి ఉందని..  అతడిని వెలుగులోకి తీసుకొస్తే భారత్ కు మరో ఉమ్రాన్ మాలిక్ దొరికినట్టేనని కామెంట్స్ చేస్తున్నారు. 

బాషిర్ తో పాటు జమ్మూకాశ్మీర్  జట్టులో  అకిబ్ నబి కూడా గత కొంతకాలంగా మెరుగ్గా రాణిస్తున్నాడు. అకిబ్.. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్.  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థుడు. నబికి సంబంధించిన గ్లింప్స్  ను కూడా మోహ్సిన్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు. ఇప్పుడు నబీ, బాషిర్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి  వచ్చే నెలలో వేలంలో పాల్గొనబోయే పది ఫ్రాంచైజీల ప్రతినిధులు ఈ వీడియోలు చూశారో లేదో..? ఒకవేళ వాళ్లు చూస్తే మాత్రం వీరిని వదులుకునే సవాలే లేదంటున్నారు క్రికెట్ అభిమానులు. ఈ యువకులను ప్రోత్సహిస్తే కల్లోలిత జమ్మూ కాశ్మీర్ ఇకనుంచి నాణ్యమైన క్రికెటర్లను అందించడం ఖాయమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.. 

 

Follow Us:
Download App:
  • android
  • ios