Asianet News TeluguAsianet News Telugu

వికెట్ నెం.3, ఫారెన్ లీగ్స్ మోజులో పడ్డ కివీస్ క్రికెటర్లు.. న్యూజిలాండ్ బోర్డుకు షాకిచ్చిన మరో ఆల్ రౌండర్

James Neesham: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) భయపడిందంతా అవుతుంది. ట్రెంట్ బౌల్ట్ రాజేసిన చిచ్చు.. ఆ దేశ క్రికెట్ బోర్డును ఆగమాగం చేస్తున్నది. 

Another Blow For NZC, James Neesham Declines New Zealand Central Contract
Author
First Published Sep 16, 2022, 12:18 PM IST

సరిగ్గా 40 రోజుల కిందటి ముచ్చట..  ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న   న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆ దేశం క్రికెటర్లకు అందించే సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుని ఎన్‌జెడ్‌సీ కి భారీ షాకిచ్చాడు.  తనను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించాలని బౌల్ట్ పెట్టుకున్న అభ్యర్థనకు ఎన్‌జెడ్‌సీ సానుకూలంగా స్పందించింది. కానీ అదే సమయంలో బోర్డు ఏదైతే జరుగకూడదని అనుకుందో ఇప్పుడు  న్యూజిలాండ్ క్రికెట్ లో అదే జరుగుతున్నది. ట్రెంట్ బౌల్ట్ బాటలో మరికొంతమంది క్రికెటర్లు నడుస్తారని ఎన్‌జెడ్‌సీ అంచనావేసినట్టుగానే ఒక్కొక్కరుగా న్యూజిలాండ్ కు షాకులిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో కివీస్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ కూడా చేరాడు.  నీషమ్ కూడా బౌల్ట్ మాదిరిగానే సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నాడు. 

సోషల్ మీడియా వేదికగా నీషమ్ స్పందిస్తూ ఈ ప్రకటన చేశాడు. ఫారెన్ లీగ్స్ లో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్నట్టు అతడు తెలిపాడు. తాను చేసిన పని డబ్బుకోసమని అనుకుంటారని, కానీ ముందస్తు ఒప్పందాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఇన్స్టాగ్రామ్ లో అతడు షేర్ చేసిన నోట్ లో రాసుకొచ్చాడు. 

నీషమ్ స్పందిస్తూ.. ‘నేను సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుని పారెన్ లీగ్స్ లో డబ్బుల కోసమే ఆడతారని వార్తలు వస్తాయని, అందరూ నన్ను తప్పుబడతారని నాకు తెలుసు.  కానీ నాకు ఎన్‌జెడ్‌సీ నుంచి జులై వరకు సెంట్రల్ కాంట్రాక్టు ఇచ్చి ఉంటే దానిని వదులుకునేవాడిని కాదు. అదే సమయంలో నేను విదేశీ లీగ్స్ లో  ఒప్పందాలు కుదుర్చుకున్నా.  అది చాలా కఠిన నిర్ణయం. ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి నేను ఎన్‌జెడ్‌సీ సెంట్రల్ కాంట్రాక్టును వదులుకుంటున్నా. కివీస్ కు ఆడటం ఎప్పటికీ గొప్ప గౌరవంగా భావిస్తా.  సెంట్రల్ కాంట్రాక్టు వదులుకున్నా నేను జట్టు సెలక్షన్ లో అందుబాటులో ఉంటా.. నా దేశం తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నా..’ అని రాసుకొచ్చాడు. 

న్యూజిలాండ్ లో సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు అక్కడ జట్టు ఎంపికలో ఫస్ట్ ఛాయిస్ క్రికెటర్లుగా పరిగణించబడతారు. సెంట్రల్ కాంట్రాక్టు ఉండి వాళ్లు అందుబాటులో లేకుంటేనే జట్టు మిగతా ఆటగాళ్ల వైపు చూస్తుంది.  కానీ బౌల్ట్ తో పాటు కొలిన్ గ్రాండ్ హోమ్, జేమ్స్ నీషమ్ తాజాగా దానినే వదులుకోవడం గమనార్హం. బౌల్ట్ సెంట్రల్ కాంట్రాక్టు వదులుకున్నకొద్దిరోజులకే  గ్రాండ్ హోమ్ కూడా అదే బాటలో నడిచిన విషయం తెలిసిందే. 

 

ఒకవిధంగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకోవడమంటే అనధికారిక రిటైర్మెంట్ తోనే సమానం. ఒక్కసారి లీగ్ లో ఆట, డబ్బుకు అలవాటు పడ్డ క్రికెటర్లు మళ్లీ వెళ్లి దేశం తరఫున ఆడటం అంత సులువు కాదు. అదీగాక ఎప్పుడో గానీ అందుబాటులో ఉండే ఆటగాళ్లను సెలక్టర్లు కూడా పట్టించుకోరు. దానివల్ల జట్టు కూర్పు కూడా దెబ్బతినే ప్రమాదముంది. 

ఇదిలాఉండగా న్యూజిలాండ్ క్రికెట్ లో ఇది నీషమ్ తోనే ఆగుతుందా..? లేక మరికొంతమంది క్రికెటర్లు కూడా అదేబాటలో నడుస్తారా..? అనేది కొద్దిరోజుల్లో తేలాల్సి ఉంది.  ఐపీఎల్ తో పాటు యూఏఈ వేదికగా జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, ది హండ్రెడ్, బిగ్ బాష్ లీగ్ లతో   ఫ్రాంచైజీ క్రికెట్ కళకళలాడుతున్నది.  వీటిలో పాల్గొనేందుకే బౌల్ట్ తోపాటు మిగిలిన క్రికెటర్లూ తమ అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios