ICC Womens T20 World Cup 2023: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టిన విషయం తెలిసిందే. ఆసీస్ చేతిలో భారత్ ఓడింది.
మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా రెండ్రోజుల క్రితం ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిన భారత జట్టు ఈ మ్యాచ్ లో కీలక తప్పిదాలు చేసి మూల్యాన్ని చెల్లించుకుంది. ముఖ్యంగా బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో టీమిండియా చేసిన తప్పిదాలతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్.. ఐదు పరుగుల తేడాతో ఓడింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డర్ల మిస్ ఫీల్డ్ లు, బౌలర్ల చెత్త బౌలింగ్ భారత జట్టు ఓటమికి కారణమని మాజీ సారథి అంజుమ్ చోప్రా విమర్శలు గుప్పించింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ 1,9 పరుగుల వద్ద ఉండగా వికెట్ కీపర్ రిచా ఘోష్ క్యాచ్ మిస్ చేయడంతో పాటు స్టంపింగ్ చేసే అవకాశాన్ని జారవిడించింద. అంతేగాక ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ 32 పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన క్యాచ్ ను షఫాలీ వర్మ మిస్ చేసింది. ఫలితంగా ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
ఇదే విషయమై అంజుమ్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఆస్ట్రేలియా కు బౌలింగ్ చేస్తున్నప్పుడు భారత్ స్ట్రాటజీ ఏంటో నాకైతే అర్థం కాలేదు. వాస్తవానికి న్యూలాండ్స్ గ్రౌండ్ స్లో వికెట్. కానీ స్పిన్నర్లను మాత్రం షాట్ అవుట్ సైడ్ దిశగా బంతులు వేయించారు. అందరు బౌలర్లూ అదే వ్యూహంతో బౌలింగ్ చేస్తే వికెట్లు ఎలా వస్తాయి..? బౌలర్లు ఇలా ఉంటే ఫీల్డర్ల పరిస్థితి మరీ దారుణం. చేతిలోకి వచ్చిన క్యాచ్ లను కూడా వాళ్లు మిస్ చేశారు. షఫాలీ వర్మ గురించి మాట్లాడుకుంటే.. ఆమె యంగ్ ప్లేయర్. సాధారణంగా యువ ఆటగాళ్లు ఫీల్డింగ్ లో రాణిస్తారని అంతా అనుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి...’అని తెలిపింది.
మహిళల 2022 వన్డే వరల్డ్ కప్ నుంచి భారత్ గుణపాఠాలు నేర్చుకోలేదని అసలు ప్రస్తుత టీ20 ప్రపంచకప్ కోసం భారత్ ఏం ప్రిపరేషన్స్ తో వచ్చిందో అర్థం కావడంలేదని విమర్శలు గుప్పించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెత్ మూనీ (54), లానింగ్ (49), ఆష్లే గార్డ్‌నర్ (31) లు ధాటిగా ఆడారు. లక్ష్య ఛేదనలో భారత్.. 20 ఓవర్లలో 167 పరుగులకే పరిమితమైంది. స్టార్ బ్యాటర్లు షఫాలీ (9), స్మృతి మంధాన (2) లు విఫలమయ్యారు. 28 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆ క్రమంలో జెమీమా రోడ్రిగ్స్ (43), హర్మన్‌ప్రీత్ కౌర్ (52)లు భారత్ ను ఆదుకున్నారు. హర్మన్ నిష్క్రమణతో మ్యాచ్ గమనమే మారిపోయింది. చివరికి భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ప్రపంచకప్ లో మరోసారి భారత్ కు నిరాశే ఎదురైంది.
