టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన కెరీర్ లో అత్యుత్తమ కెప్టెన్ అని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నారు. గంగూలీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన ఆర్పీ.. ధోనీ కెప్టెన్సీ వరకు టీమిండియాలో కొనసాగాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే సారథ్యంలోనూ తన హవా కొనసాగించాడు.

ఇటీవల మాజీ బ్యాట్స్ మన్ ఆకాశ్ చొప్రాతో ముచ్చటించిన ఆర్పీ సింగ్.. తన నలుగురు కెప్టెన్పీల గురించి చెప్పాడు. అంద‌రిలోకెళ్లా కుంబ్లే త‌న బెస్ట్ సార‌థి అని చెప్పాడు. దాదా విష‌యానికి వ‌స్తే.. ఆట‌గాళ్ల‌లో మ‌న‌స్థైర్యం ఎలా నింపాలో బెంగాల్ టైగ‌ర్ కంటే బాగా ఎవ‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చ‌ని అన్నాడు. 

`తొలిసారి సౌర‌వ్ గంగూలీ కెప్టెన్సీలో జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చా. మైదానంలో బంతి నావైపు విసిరిన దాదా వెళ్లి బౌలింగ్ చేయి అన్నాడు. తొలి బంతి వైడ్‌, మ‌రుస‌టి బంతి కూడా వైడ్‌. అయినా ఏం అన‌లేదు. ఆరంభంలో ఎవ‌రికైనా ఇలాగే జ‌రుగుతుందిలే ఏం ఫ‌ర్వాలేదు నేను చూసుకుంటా` అని ఆర్పీ సింగ్ అన్నాడు. 

ఇక ఒక బౌల‌ర్‌గా కుంబ్లే కెప్టెన్సీ అత్యుత్త‌మ‌మ‌ని.. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం ఉండ‌టంతో బౌలింగ్‌పై పూర్తి అవ‌గాహ‌న కుంబ్లే సొంత‌మ‌ని ఆర్పీ చెప్పాడు. ఇక టెక్నిక‌ల్‌గా రాహుల్ ద్ర‌విడ్‌ను మించిన సార‌థి మ‌రొక‌రు ఉండ‌ర‌ని.. మ్యాచ్‌ను చ‌ద‌వ‌డంలో మ‌హేంద్ర సింగ్ ధోనీ మాస్ట‌ర్ అని ఆర్పీ కొనియాడాడు.

అనంతరం ధోనీ గురించి మాట్లాడుతూ...ధోనీ కెరీర్ దూసుకుయిన సందర్భంలో తనది మాత్రం దిగజారిందని భారత మాజీ పేసర్ ఆర్పీసింగ్ తెలిపాడు. కానీ ధోనీ ఎంత ఎదిగినా తమ స్నేహం మాత్రం చెక్కు చెదరలేదని, కానీ క్రికెట్ విషయంలో మాత్రం బేధాభిప్రాయాలు ఉన్నాయని ఈ వరల్డ్‌కప్ విన్నింగ్ పేసర్ చెప్పుకొచ్చాడు.