ముంబై: టీమిండియా మాజీ  కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవితవ్యంపై టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపిఎల్ పై ఆధారపడి ధోనీ తిరిగి జట్టులోకి తిరిగి రావడమనేది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. టీ20 ప్రపంచ కప్ పోటీలకు ధోనీ సేవలు అవసరమని జట్టు భావిస్తే టీమిండియాలో తప్పక ఉంటాడని చెప్పారు. 

ధోనీపై ఏ విధమైన నిర్ణయం ఉంటుందనేది మనం వేచి చూడాల్సిందేనని కుంబ్లే అన్నారు. కేఎల్ రాహుల్ ను బ్యాకప్ వికెట్ కీపర్ గా భావిస్తే ప్రపంచ కప్ పోటీలకు ముందు అతడిని 10 -12 మ్యాచుల్లో ఆడించాలని ఆయన అన్నారు. రాహుల్ టీ20 ఫార్మాట్ లో అద్బుతమైన ఆటగాడని ఆయన కొనియాడారు. తన పాత్రకు రాహుల్ పూర్తి న్యాయం చేస్తాడని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు 

తన దృష్టిలో ఈ ఏడాది భారత క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడు రోహిత్ శర్మ అని, అన్ని ఫార్మాట్లలో అతను అదరగొట్డాడని, అత్యుత్తమ యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ అని కుంబ్లే అన్నారు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ లో ఆల్ రౌండర్ల కన్నా వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్లపై టీమిండియా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 

వికెట్లు తీసే సత్తా ఉన్న కుల్ దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ జట్టులో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మంచు ప్రభావం చూపినప్పుడు వారు బాగా రాణిస్తారని ఆయన చెప్పారు. మ్యాచులో ప్రత్యర్థుల వికెట్లపై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఆల్ రౌండర్ల కన్నా వికెట్లు తీసే ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

ఆస్ట్రేలియా పిచ్ లను దృ,్టి పెట్టుకుని జట్టును సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చే బౌలర్లను ఎంపిక చేసుకోవాలని కుంబ్లే చెప్పారు.