Asianet News TeluguAsianet News Telugu

అందని ద్రాక్ష పుల్లన.. ఐపీఎల్‌పై బాబర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్న ఇండియన్ ఫ్యాన్స్..

Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ మరోసారి భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఐపీఎల్ పై అతడు చేసిన కామెంట్సే ఇందుకు  కారణమయ్యాయి.  
 

Angoor na Mile Toh angoor Khatte Hai: Indian Fans Trolls Babar Azam After His Comments on IPL MSV
Author
First Published Mar 17, 2023, 10:21 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై   పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్  చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.  ఐపీఎల్ కంటే  బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) అంటే ఇష్టమని అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో భారత అభిమానులు స్పందిస్తూ.. ‘అందని ద్రాక్ష పుల్లన’అంటూ బాబర్ కు కౌంటర్ ఇస్తున్నారు. 

అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో భాగంగా పెషావర్ జల్మీ  తరఫున  నిర్వహిస్తున్న పోడ్కాస్ట్ లో బాబర్ మాట్లాడుతూ.. తనకు ఐపీఎల్  కంటే  ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) అంటేనే ఎక్కువ ఇష్టమని  చెప్పాడు.  

పెషావర్ జల్మీ  పోడ్కాస్ట్ లో యాంకర్  ‘బీబీఎల్ లేదా ఐపీఎల్ లో ఏదో ఒకదానిని ఎంచుకోండి..?’అని అడగ్గా దానికి బాబర్..  బీబీఎల్ అని చెప్పాడు. ఎందుకు..? అని యాంకర్ అడగ్గా.. బాబర్ స్పందిస్తూ... ‘ఆస్ట్రేలియాలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. అక్కడి పిచ్ లు కూడా భిన్నంగా ఉంటాయి.  బంతి బ్యాట్ మీదకు దూసుకువస్తుంది.   అక్కడ చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.  కానీ ఐపీఎల్ లో  ఏముంది..? మనకు ఇక్కడ (పాకిస్తాన్) ఉన్నట్టే ఆసియా కండిషన్సే ఉంటాయి...’ అని చెప్పాడు.   

కాగా ఐపీఎల్.. 2008లో ప్రారంభమవగా బాబర్ కు నచ్చే బీబీఎల్ 2011లో ఆరంభమైంది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ 2015లో మొదలైంది.  తనకు బీబీఎల్ అంటే ఇష్టమని చెప్పిన బాబర్.. అటు ఆ లీగ్ లో  ఇంతవరకూ ఆడలేదు. పలుమార్లు బీబీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపినా పాకిస్తాన్ బోర్డు అతడికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వలేదు.  ఇక 2008 తొలి ఎడిషన్ లో మాత్రమే పాకిస్తాన్ ప్లేయర్లను ఐపీఎల్ లో ఆడటానికి అవకాశమిచ్చిన భారత ప్రభుత్వం.. ఆ తర్వాత సరిహద్దు, రాజకీయ వివాదాలతో వారిని ఈ లీగ్ లోకి అనుమతించడం లేదు. 

 

బాబర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో భారత అభిమానులు   అతడికి కౌంటర్ ఇస్తున్నారు. ‘ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయి..’, ‘తొక్కలో నీ అభిప్రాయం ఎవడికి కావాలి. నువ్వు మెచ్చే   బీబీఎల్ లోని ఆస్ట్రేలియా ప్లేయర్లే  వాళ్ల స్వంత దేశం ఆడే సిరీస్ లను కాదనుకుని  వచ్చి ఐపీఎల్ ఆడుతున్నారు. నువ్వు ఐపీఎల్ లో ఆడటం లేదని పిచ్చి వాగుడు వాగకు..’, ‘అందని ద్రాక్ష పుల్లన’, ‘అతడు ఎలాగూ ఐపీఎల్ ఆడలేడు.  ఎందుకంటే దానిని అందుకోవడం బాబర్ కు శక్తికి మించిన పని. అంతే,  అంతకుమించి ఇంకేమీ లేదు..’అని  కౌంటర్లు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన  మీమ్స్,  వీడియోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.

 

 

ఇదిలాఉండగా  బాబర్ సారథ్యంలోని పెషావర్ జల్మీ.. పీఎస్ఎల్ ప్లేఆఫ్స్   ఎలిమినేటర్ 1 గండాన్ని దాటి 2 కు అర్హత సాధించింది.   నిన్న ఇస్లామాబాద్ తో జరిగిన మ్యాచ్ లో  పెషావర్ జల్మీ.. తొలుత  బ్యాటింగ్ చేసి  8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బాబర్.. 64 పరుగులు చేశాడు. అనంతరం ఇస్లామాబాద్.. 20 ఓవర్లలో 171 పరుగులకే పరిమితమైంది. దీంతో  పెషావర్.. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios