ఏంజెలో మాథ్యూస్ సెంచరీతో రెండో ఇన్నింగ్స్‌లో 302 పరుగుల భారీ స్కోరు చేసిన శ్రీలంక... న్యూజిలాండ్ ముందు 285 పరుగుల భారీ టార్గెట్... తొలి వికెట్ కోల్పోయిన కివీస్.. 

మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, లసిత్ మలింగ వంటి ప్లేయర్లు రిటైర్ అయిన తర్వాత శ్రీలంక ఆటతీరు దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్‌కి చుక్కలు చూపించిన శ్రీలంక, ఇప్పుడు బంగ్లాదేశ్‌, ఆఫ్ఘాన్‌లపై గెలవడానికి కూడా కష్టపడుతోంది. అలాంటి ఒక్కసారిగా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ టీమిండియాని భయపెడుతోంది...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆడుతోంది. ఇప్పటికే ఇండోర్ టెస్టు గెలిచిన ఆస్ట్రేలియా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఆఖరి టెస్టులో గెలిచి తీరాల్సిందే. లేదంటే మూడో స్థానంలో ఉన్న శ్రీలంకకు అవకాశాలు పెరుగుతాయి. విదేశాల్లో పెద్దగా మెరగైన రికార్డు లేని లంక, న్యూజిలాండ్ పర్యటనలో జరుగుతున్న మొదటి టెస్టులో తిరుగులేని ఆధిక్యం సాధించింది...

కుశాల్ మెండిస్ 87, దిముత్ కరుణరత్నే 50, ధనంజయ డి సిల్వ 46 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేసింది శ్రీలంక. లంక బౌలర్లు చెలరేగిపోవడంతో 188 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది న్యూజిలాండ్. అయితే డార్ల్ మిచెల్ 102, మ్యాట్ హెన్రీ 72 పరుగులు చేసి రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకి ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్. కివీస్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్ సెంచరీతో చెలరేగాడు. 235 బంతుల్లో 11 ఫోర్లతో 115 పరుగులు చేసిన ఏంజెలో మాథ్యూస్, టెస్టు కెరీర్‌లో 14వ సెంచరీ అందుకున్నాడు. శ్రీలంక తరుపున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన 8వ బ్యాటర్‌గా నిలిచాడు ఏంజెలో మాథ్యూస్...

సనత్ జయసూర్య 110 మ్యాచుల్లో 14 సెంచరీలు చేయగా ఏంజెలో మాథ్యూస్ 101 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. తిలన్ సమరవీర 81 మ్యాచుల్లో, దిముత్ కరుణరత్నే 83 టెస్టుల్లో 14 సెంచరీలు చేసి మాథ్యూస్ కంటే ముందున్నారు...

దినేష్ చండీమల్ 42, ధనంజయ డి సిల్వ 47 పరుగులు చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో 302 పరుగులకి ఆలౌట్ అయ్యింది శ్రీలంక. దీంతో న్యూజిలాండ్ ముందు 285 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. సూపర్ ఫామ్‌లో ఉన్న డివాన్ కాన్వే 5 పరుగులు చేసి అవుట్ కావడంతో 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్...

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది ఆతిథ్య న్యూజిలాండ్. టామ్ లాథమ్ 11, కేన్ విలియంసన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరి రోజు న్యూజిలాండ్ 257 పరుగులు చేయాల్సి ఉంటుంది...

శ్రీలంక విజయం ముంగిట నిలవడంతో టీమిండియా, ఆఖరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పొజిషన్‌లో నిలబడింది. ఒకవేళ అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా ఓడితే, శ్రీలంకకు అవకాశాలు పెరుగుతాయి. మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో న్యూజిలాండ్‌ని ఓడిస్తే, ఫైనల్‌కి వెళ్లే ఛాన్స్ కొట్టేస్తుంది శ్రీలంక..