హెల్మెట్ మార్చి తీసుకొచ్చిన ఏంజులో మాథ్యూస్... టైమ్ అవుట్ ఇచ్చిన అంపైర్! వరల్డ్ కప్‌లో అరుదైన దృశ్యం..
హెల్మెట్ మార్చి తీసుకొచ్చిన ఏంజెలో మాథ్యూస్... నిర్దిష్ట సమయం దాటిపోవడంతో అప్పీలు చేసిన బంగ్లాదేశ్, ‘టైం అవుట్’ ఇచ్చిన అంపైర్లు..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా క్యాచ్ అవుట్, స్టంపౌట్, రనౌట్, ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్ వంటి డిస్మిసల్స్ మాత్రమే చూస్తుంటాం. అయితే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజులో మాథ్యూస్ టైమ్ అవుట్ రూపంలో అవుట్ అయ్యాడు..
ఓ బ్యాటర్ అవుటైన తర్వాత కొత్త బ్యాటర్ క్రీజులోకి రావడానికి నిర్ధిష్ట సమయం ఉంటుంది. టీ20ల్లో అయితే 2 నిమిషాల్లో, వన్డే, టెస్టు మ్యాచుల్లో అయితే 3 నిమిషాల్లో కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చి రెఢీగా ఉండాలి.
షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సధీర సమరవిక్రమ అవుటైన తర్వాత ఏంజులో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే తన హెల్మెట్ కాకుండా వేరే హెల్మెట్ తీసుకుని వచ్చాడు. వేరే హెల్మెట్ తీసుకురమ్మని డ్రెస్సింగ్ రూమ్‌కి సిగ్నల్ ఇచ్చాడు. ఈలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది...
దీంతో బంగ్లాదేశ్ టైమ్ అవుట్ కోసం అప్పీల్ చేయడం, అంపైర్ అవుట్‌గా ఇవ్వడం జరిగిపోయాయి. వేరే హెల్మెట్‌తో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్, హెల్మెట్ లేకుండా ఒక్క బాల్ ఎదుర్కొని, తర్వాత హెల్మెట్ మార్చినా ఇలా అవుట్ అయ్యేవాడు కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో టైమ్ అవుట్ రూపంలో అవుటైన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు ఏంజెలో మాథ్యూస్..