Australia Head Coach: ఆస్ట్రేలియా క్రికెట్ లో ఇటీవల అత్యంత చర్చనీయాంశమైన ఆ జట్టు హెడ్ కోచ్ పదవికి సంబంధించిన చర్చకు తెర పడింది. మాజీ హెడ్ కోచ్ స్థానంలో తాత్కాలికంగా నియమించిన...
గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియా క్రికెట్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయానికి తెరపడింది. మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ను అనూహ్య పరిస్థితుల్లో ఆ పదవి నుంచి దిగిపోయేలా చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. ఆ కాంట్రాక్టును ఎవరికి అప్పజెప్పుతుందా..? అని ఆస్ట్రేలియా తో పాటు ఇతర దేశాల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. హెడ్ కోచ్ పదవి కోసం గడిచిన రెండు నెలలుగా వందలాది మంది ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోగా వారిలోంచి కాచి వడబోసిన సీఏ.. ఆఖరికి తాత్కాలిక హెడ్ కోచ్ వైపే మొగ్గు చూపింది. జస్టిన్ లాంగర్ తన పదవిలోంచి దిగిపోయాక నియమించిన ఆండ్రూ మెక్ డొనాల్డ్ నే తిరిగి కొనసాగించనుంది.
ఈ మేరకు సీఏ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. లాంగర్ దిగపోయాక ఆ పదవిలో మెక్ డొనాల్డ్ ను కూర్చోబెట్టిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు తాజాగా అతడి కాంట్రాక్ట్ ను నాలుగేండ్లకు పెంచింది. సీఏ తాజా ప్రకటనతో ఆసీస్ కు అన్ని ఫార్మాట్లలో మెక్ డొనాల్డే హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు.
ప్రతిష్టాత్మక ఆసీస్ హెడ్ కోచ్ పదవికి మాజీ ఆటగాళ్లు మైఖేల్ క్లార్క్, జేసన్ గిలెస్సీ, రికీ పాంటింగ్ గ్రెగ్ షిపర్డ్ లు ఇందుకు ఆసక్తి చూపారని గతంలో వార్తలు కూడా వెలువడ్డాయి. ఈ మేరకు సీఏ కు కూడా కుప్పలుగా అప్లికేషన్లు వచ్చాయని, కానీ వారందిరలోకెల్లా మెక్ డొనాల్డ్ వైపే తాము మొగ్గు చూపినట్టు సీఏ బాస్ నిక్ హాక్లీ తెలిపాడు.
‘ఆసీస్ హెడ్ కోచ్ పదవికి మాకు చాలా దరఖాస్తులు వచ్చాయి. మేం చాలా పరిశీలించాం. అయితే ఇప్పటికే తాత్కాలిక హెడ్ కోచ్ గా ఉన్న మెక్ డొనాల్డ్.. పాకిస్తాన్ తో సిరీస్ లో తానేంటో నిరూపించుకున్నాడు. ఆయన పనితనం ప్రత్యక్షంగా కనబడుతున్నది. అన్నీ పరిశీలించిన మీదట.. అతడినే హెడ్ కోచ్ గా కొనసాగించాలని సీఏ నిర్ణయించింది..’ అని హాక్లీ చెప్పాడు.
కాగా మెక్ డొనాల్డ్ కు ఇప్పుడు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. వచ్చే ఏడాది భారత్ లో వన్డే ప్రపంచకప్ కూడా ఉంది. వీటితో పాటు కీలక సిరీస్ లు కూడా ముందున్న నేపథ్యంలో అతడు కంగారూలను ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం.
ఆస్ట్రేలియా తరఫున 2009లో నాలుగు టెస్టులు ఆడిన మెక్ డొనాల్డ్ 107 పరుగులు చేసి 9 వికెట్లు కూడా తీశాడు. ఆయన ఆల్ రౌండర్ గా ఆస్ట్రేలియా దేశవాళీలో మంచి పేరు సంపాదించాడు. 2019లో ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో చేరాడు. నాలుగేండ్ల పాటు అతడు ఆసీస్ ను నడిపించనున్నాడు. లాంగర్ తప్పుకోవడంతో పాకిస్తాన్ పర్యటనలో మెక్ డొనాల్డ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. టెస్టులలో ఆసీస్.. 1-0తో పాక్ ను ఓడించింది. వన్డేల్లో 1-2 తేడాతో ఓడినా ఏకైక టీ20లో ఆసీస్ నే విజయం వరించింది.
