ఈ ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచులన్నీ ఒక ఎత్తు అయితే.. చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ మరో ఎత్తు అని చెప్పాలి. ఆట చాలా రసవత్తరంగా సాగింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే వరసగా వికెట్లు పోగొట్టుకున్న కోల్ కతా.. తర్వాత చెన్నైకి చెమటలు పట్టించే స్థాయికి వచ్చింది. చివరకు విజయం చెన్నైకే దక్కినా.. కోల్ కతా పోరాటం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

సీఎస్‌కే నమోదు చేసిన 220 భారీ స్కోరు ఒకటైతే, ఆపై కేకేఆర్‌ 202 పరుగులకు వచ్చి ఇంకా ఐదు బంతులు ఉండగా ఆలౌట్‌ కావడం మరొకటి. ఆ ఐదు బంతులు కేకేఆర్‌ ఆడి ఉండే ఆ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉండేది ఊహించడం కష్టమే. 20 ఓవర్‌ తొలి బంతిని ఆడిన కమిన్స్‌ స్టైకింగ్‌ తీసుకోవాలనే ఉద్దేశంతో రెండో పరుగు కోసం పరుగెట్టాడు. ఆ క్రమంలోనే ప్రసీద్ధ్‌ కృష్ణ రనౌట్‌ కావడంతో కేకేఆర్‌ కథ ముగిసింది. ఈ మ్యాచ్‌ చూసిన ఆ ఫ్రాంచైజీ అభిమానులకు ఇది తీవ్ర నిరాశను మిగిల్చింది. 

ఈ మ్యాచ్ లో రసెల్‌, కమిన్స్‌లు ఆడిన ఇన్నింగ్స్‌ సీఎస్‌కేకు దడపుట్టించింది. రసెల్‌ ఆరో వికెట్‌గా ఔటైన తర్వాత అతను డగౌట్‌లోని మెట్లపైనే కూర్చుండిపోయాడు.  గ్లౌజ్‌లు, ప్యాడ్లు, హెల్మెట్‌ తీయకుండా అలానే మ్యాచ్‌ చూస్తూ ఉండిపోయాడు. అనవసరంగా ఔట్‌ అయ్యాననే బాధ రసెల్‌లో స్పష్టంగా కనబడింది..

 

కీలక సమయంలో అయిపోయినందకు రసెల్‌లో పశ్చాత్తాపం కనిపించింది.  రసెల్‌ను  కెమెరాలు క్యాప్చుర్‌ చేయడం, అది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఫ్యాన్స్‌ రసెల్‌ అలా చూస్తే బాధేస్తుందంటూ ట్వీట్లు చేస్తున్నారు. ‘ రసెల్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు అమోఘం’ అని  ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘  ప్రతీ క్రికెట్‌ లవర్‌ నిన్ను ఇలా చూసిన తర్వాత బాధపడకుండా ఉండడు’ అని స్పందించాడు. మ్యాచ్ ఓడినా.. రసెల్, కమిన్స్ ఆటకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.