Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సీఎంను కలిసిన రాయుడు.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా..?

Ambati Rayudu Meets YS Jagan:  టీమిండియా మాజీ క్రికెటర్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన  అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశాడు. 

Amid Political Entry Gossips, Former CSK Batter Ambati Rayudu Meets AP CM YS Jagan Mohan Reddy MSV
Author
First Published Jun 8, 2023, 6:14 PM IST

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ ఫైనల్‌లో తన చివరి ఇన్నింగ్స్ ఆడి అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఊతమిస్తూ తాజాగా రాయుడు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశాడు. ఐపీఎల్ - 16 ట్రోఫీ గెలిచిన తర్వాత తాడేపల్లిలోనీ సీఎం క్యాంప్ కార్యాలయంలో   జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాయుడు..  ట్రోఫీని  ఏపీ సీఎంకు చూపించారు. 
 
జగన్‌తో భేటీ అయిన రాయుడు.. పొలిటికల్ ఎంట్రీ గురించి   చర్చించినట్టు సమాచారం.  గత కొంతకాలంగా  జగన్ ను పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్న  రాయుడు..   వైసీపీ లో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారని  కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో జగన్‌ను కలవడం రాయుడుకు ఇది రెండోసారి.   

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక రాయుడు పూర్తిస్థాయి రాజకీయ  ఇన్నింగ్స్‌ను మొదలుపెడతాడని.. ఇందులో భాగంగానే  జగన్‌ను కలిసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.  గుంటూరులోని  పొన్నూరు మండలం  వెల్లలూరు రాయుడు  సొంతూరు.  పొన్నూరు నుంచి అసెంబ్లీకి గానీ గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి  పార్లమెంట్‌కు గానీ రాయుడు బరిలోకి దిగే అవకాశాలున్నట్టు  రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాయుడు అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.  ప్రస్తుతం గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు.  వచ్చే ఎన్నికలలో ఆయనకు పోటీగా ధీటైన   అభ్యర్థిని నిలబెట్టాలని వైసీసీ పావులు కదుపుతున్నది.   

 

కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు.. గుంటూరు లోక్‌సభ నుంచి పోటీ చేస్తే అది తమకు అనుకూలంగా ఉంటుందా..? లేక అసెంబ్లీకే పోటీ చేయించాలా..? అన్నదానిపై వైసీసీ అధిష్టానం లెక్కలు వేస్తున్నది. అయితే ఇప్పటికైతే రాయుడు ఇంకా  అధికారికంగా రాజకీయ ఎంట్రీ ఇవ్వలేదు. అతడు పార్టీలో చేరిన తర్వాతే  సమీకరణాల ఆధారంగా   అసెంబ్లీనా లేక పార్లమెంట్ కు పోటీ  చేయించాలా..? అన్నది తేలనుంది.  

టీడీపీ గాలం.. 

రాయుడు వైసీపీలో చేరుతున్నారన్న  ప్రచారం నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ కూడా అప్రమత్తమైంది.   రాయుడును తమ  పార్టీలో చేర్చుకునేందుకు అతడికి గాలం వేస్తోంది. గతంలో  రాయుడు తాత.. టీడీపీ హయాంలో సర్పంచ్ గా పనిచేశాడని అతడికి గుర్తు  చేస్తూ మూలాలను మరువద్దంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.  టీడీపీతో పాటు జనసేన కూడా రాయుడుకు ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నా  అతడు  వైసీపీలో చేరేది  ఖాయమేనని రాజకీయ వర్గాల సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios