ICC on ODIs: వన్డే క్రికెట్ పై ఆసక్తికర చర్చ జరుగుతున్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక వ్యాఖ్యలు చేసింది.  వన్డే క్రికెట్ కు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పింది.  

‘వన్డే క్రికెట్ చచ్చిపోతున్నది. దీనిని రద్దు చేయాలి’, ‘వన్డేలను ఎవరూ చూడటం లేదు. అందరూ టీ20, టెస్టులనే ఇష్టపడుతున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్ ను రద్దు చేయడమే బెటర్’, ‘వన్డేలు మరీ బోర్ అవుతున్నాయి. 9 గంటల పాటు మ్యాచ్ లు చూసే ఓపిక జనాలకు ఎక్కడిది..?’, ‘వన్డే క్రికెట్ బతకాలంటే 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించాలి. అలా అయితే ఈ ఫార్మాట్ మరింత వినోదభరితంగా ఉంటుంది..’ అంటూ తాజా, మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితులు వన్డే క్రికెట్ మీద జోరుగా చర్చిస్తున్నారు. అందరీ అభిప్రాయమూ ఒకటే.. ఆ ఫార్మాట్ ను రద్దైనా చేయాలి, వీలైతే ఓవర్లను కుదించాలి అని.. ఈ నేపథ్యంలో క్రికెట్ అత్యున్నత మండలి ఐసీసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

‘క్రికెట్ విశ్లేషకులు’గా ముద్ర వేసుకున్న ప్రతీ ఒక్కరూ చేస్తున్న చర్చ (రచ్చ) పై స్పందిస్తూ.. ‘వన్డే క్రికెట్ కు వచ్చిన ముప్పేమీ లేదు. రాబోయే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) లో భాగంగా ఇప్పటికే అన్ని దేశాలు వన్డే సిరీస్ లను కూడా షెడ్యూల్ చేసుకున్నాయి..’ అని కుండబద్దలు కొట్టింది. 

ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ భారత్ తో వన్డే సిరీస్ ముగిశాక తాను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. అతడు రిటైర్మెంట్ ప్రకటించినప్పట్నుంచి మొదలు.. రవిశాస్త్రి, వసీం అక్రమ్, షాహిద్ అఫ్రిది, ఉస్మాన్ ఖవాజా, ఆకాశ్ చోప్రా వంటి తాజా మాజీ ఆటగాళ్లంతా వన్డేలకు ఇక చరమగీతం పాడాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. ‘దుష్ప్రచారం వద్దు. పరిమిత ఓవర్ల ఆటకు ఏ ముప్పూ లేదు. ఇప్పటికే 2023-27 ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌టీపీ) ఖరారైంది. ఈ ప్రోగ్రామ్ లో ఎలాంటి మార్పులూ లేవు. ఒక క్యాలెండర్ ఈయర్ లో వన్డేలతో పాటు టీ20లు, టెస్టులు కూడా ఉంటాయి. అందుకు అనుగుణంగా క్యాలెండర్ ను రూపొందిస్తారు. వన్డేలను తగ్గించాలనేదానిపై చర్చించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎఫ్టీపీ క్యాలెండర్ ను రూపొందించాం. ఇప్పటికైతే వన్డేలకు వచ్చిన ముప్పేమీ లేదు. మిగిలిన రెండు ఫార్మాట్ల మాదిరిగానే అది కూడా బతికే ఉంటుంది..’ అని స్పష్టం చేశాడు. 

ఆటగాళ్లు టెస్టు, టీ20లతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ కు ప్రాధాన్యమిస్తూ వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాయని వాదనలు వినిపిస్తుండగా.. మరికొంతమందేమో తీరికలేని షెడ్యూల్ వల్ల ఆటగాళ్లు వన్డే ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నారని ఆరోపిస్తున్నారు. చర్చ ఏదైనా అది వన్డే క్రికెట్ ను రద్దు చేయాలన్న దిశలోనే సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా వ్యాఖ్యలు.. ఈ చర్చకు ఇకనైనా పుల్ స్టాప్ పెడతాయోమో వేచి చూడాలి మరి..!