Asianet News TeluguAsianet News Telugu

KL Rahul: నాయకత్వానికి పనికిరాడని విమర్శలు.. ఓటముల నుంచి నేర్చుకుంటానన్న కెప్టెన్

India VS South Africa: టీమిండియా అవమానకర ఓటములపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మాజీ క్రికెటర్లేమో జట్టులో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ఇక తన కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ  తాత్కాలిక సారథి స్పందించాడు. 
 

Amid Criticism, Team India Temporary Skipper Kl Rahul break The silence Says learn from mistakes
Author
Hyderabad, First Published Jan 24, 2022, 8:27 PM IST

దక్షిణాఫ్రికాలో భారత జట్టు పేలవ ప్రదర్శన అనంతరం టీమిండియా సారథి కెఎల్ రాహుల్ నాయకత్వంపై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై భారత మాజీ క్రికెటర్ల నుంచి మొదలు టీమిండియా అభిమానుల వరకు రాహుల్ నాయకత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఐపీఎల్ లో ఫెయిల్యూర్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పితే భవిష్యత్తులో కూడా భారత జట్టుకు ఘోర పరాజయాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.  ముప్పేట విమర్శల వర్షం కురుస్తుండటంతో  రాహుల్ స్పందించాడు. కష్టమైన ప్రయాణాలు వ్యక్తులను బలంగా ఎదగడానికి సహాయపడతాయని, ఓటముల నుంచి నేర్చుకుంటానని చెప్పాడు.

ట్విట్టర్ వేదికగా స్పందించిన రాహుల్.. ‘కష్టమైన ప్రయాణాలు మిమ్మల్ని మరింత మెరుగుపరచడానికి, బలంగా ఎదగడానికి సహాయపడుతాయి. కొన్నిసార్లు  ఫలితాలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ తప్పుల నుంచి మనం నేర్చుకుంటాం. దేశాన్ని నడిపించడం గొప్ప గౌరవం. దానిని మాటల్లో వర్ణించలేము... ’ అని పేర్కొన్నాడు. 

 

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు పరిమిత ఓవర్ల క్రికెట్ కు సారథిగా నియమితుడైన  రోహిత్ శర్మకు గాయం కారణంగా రాహుల్.. టీమిండియాను నడిపించే బాధ్యతలు మోశాడు. మూడు వన్డేలలో భారత్.. దారుణ ఆటతో సిరీస్ కోల్పోయింది. టెస్టు సిరీస్ లో వాహ్వా అనిపించిన భారత బౌలర్లు.. వన్డే సిరీస్ లో తేలిపోయారు. సౌతాఫ్రికా ఆటగాళ్లు  పరుగుల వరద పారిస్తుంటే.. మన  బౌలర్లు మాత్రం వికెట్లు తీయలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భాగస్వామ్యాలను విడదీయడంలో ఆరో బౌలర్ లేని కొరత భారత్ ను తీవ్రంగా వేధించింది. 

అయితే వీటన్నికంటే  విరాట్ కోహ్లి సారథ్యంలోని దూకుడు గానీ, మ్యాచ్ సందర్భంగా అతడు అనుసరించే వ్యూహాలు గానీ ఈ సిరీస్ లో కనిపించలేదని చాలా మంది వాదన. భాగస్వామ్యాలను విడదీయడంలో అతడికి ఆప్షన్స్ లేకపోవడం..  అటాకింగ్ ఫీల్డింగ్ కొరవడటం..  గేమ్ ప్లాన్ లో విఫలమవడం.. ఇవన్నీ రాహుల్  ను అసమర్థ నాయకుడిగా చూపించాయి. విరాట్ కోహ్లి  టెస్టు బాధ్యతల నుంచి వైదొలిగిన నేపథ్యంలో.. రాహుల్ కే టెస్టు పగ్గాలను అప్పగించాలని వార్తలు రావడంతో అతడిపై  అంచనాలు భారీగా పెరిగాయి.  కానీ రాహుల్ భారత జట్టును నడిపిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో అతడు తాజాగా చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. 

రాహుల్ కా.. అతడిలో మీకు కెప్టెన్ కనిపిస్తున్నాడా..? 

టీమిండియా ఆటతీరు, రాహుల్ పేలవ నాయకత్వంపై విమర్శలు వస్తున్న వేళ బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి  సంచలన వ్యాఖ్యలు చేశాడు.  అతడికి టెస్టు పగ్గాలను అప్పజెప్పుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు అధికారి మాట్లాడుతూ... ‘రాహుల్ లో ఏ కోశాన్నైనా మీకు కెప్టెన్ కనిపిస్తున్నాడా..?’ అని ఎదురు ప్రశ్న వేశాడు. తనవరకైతే రోహిత్ శర్మ కే టెస్టు బాధ్యతలు అప్పజెప్పితే బెటరని వ్యాఖ్యానించాడు. రోహిత్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడానికి అతడి ట్రాక్ రికార్డు చాలని చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios