Asianet News TeluguAsianet News Telugu

BCCI: కరోనా విజృంభణ.. రంజీ ట్రోఫీతో పాటు ఆ రెండు టోర్నీలను వాయిదా వేసిన బీసీసీఐ..

BCCI Ranji Trophy: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలో మొదలుకావాల్సి ఉన్న రంజీ  సీజన్ ను వాయిదా వేసింది.  

Amid Covid cases Rise In The Country BCCI postpones Ranji Trophy, Col C K Nayudu Trophy and Senior Women s T20 League for 2021-22 season
Author
Hyderabad, First Published Jan 4, 2022, 9:59 PM IST

దేశంలో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఈ తరుణంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలో ప్రారంభం కావాల్సి ఉన్న రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ తో పాటు  మరో  రెండు కీలక టోర్నీలను వాయిదా వేసింది.  ఈ మేరకు  బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా  ఒక ప్రకటన విడుదల చేశారు. 

బీసీసీఐ ప్రకటన ప్రకారం.. కరోనా కేసులలో పెరుగుదల నేపథ్యంలో 2021-22 రంజీ ట్రోఫీ సీజన్ తో పాటు కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ,  సీనియర్ ఉమెన్స్  టీ20 లీగ్ ను కూడా వాయిదా వేస్తున్నట్టు జై సా ప్రకటించారు. జనవరి 13 నుంచి రంజీ సీజన్ మొదలుకానుండగా.. ఫిబ్రవరి నుంచి కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ,  ఉమెన్స్ టీ20 లీగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ మూడింటినీ వాయిదా వేస్తున్నట్టు జై షా ప్రకటనలో తెలిపారు. 

 

ఆటగాళ్ల భద్రత కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని, ఆ విషయంలో  రాజీపడే సమస్యే లేదని జై షా తన ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ టోర్నీల విషయంలో తామే త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ.. హెల్త్ కేర్ వర్కర్లకు, దేశవాళీ క్రికెటర్లకు అన్ని సదుపాయాలు అందజేస్తున్న స్టేడియం సిబ్బందికి, క్రికెట్ అసోసియేషన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. 

ఇదిలాఉండగా.. రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై జట్టులోని ఇద్దరు సభ్యులతో పాటు బెంగాల్ జట్టులోని ఏడుగురు సభ్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయా జట్లు వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే  బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కూడా కొవిడ్-19 పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios