ఐపీఎల్ 2023 సీజన్‌ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న అంబటి రాయుడు... మేజర్ లీగ్ క్రికెట్‌లో  టెక్సాస్ సూపర్ కింగ్స్‌ తరుపున ఆడబోతున్నట్టు ప్రకటన.. 

ఐపీఎల్ 2023 సీజన్‌ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, త్వరలో ప్రారంభం కాబోయే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు...

ఐపీఎల్ కంటే ముందు ప్రారంభమైన ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL)లో ఆడిన అంబటి రాయుడు, అక్కడ హైదరాబాద్ హీరోస్ టీమ్ తరుపున టైటిల్ కూడా గెలిచాడు..

ఐసీఎల్‌పై బ్యాన్ పడిన తర్వాత ఏడాదికి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ తరుపున ఆడి టైటిల్స్ గెలుచుకున్నాడు.. ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‌కి టైటిల్ అందించిన అంబటి రాయుడు, ఘనంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెరీర్‌కి ముగింపు పలికాడు.

ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన 16 రోజుల తర్వాత యూఎస్‌ఏ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 1లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ తరుపున ఆడబోతున్నట్టు ప్రకటించాడు అంబటి రాయుడు. 

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ యజమానులే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కి యజమానులు. తొలి సీజన్‌లో టీఎస్‌కేకి ఆడే ఆరుగురు విదేశీ ప్లేయర్లలో అంబటి రాయుడికి కూడా అవకాశం దక్కింది..

అంబటి రాయుడితో పాటు డివాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, డేవిడ్ మిల్లర్, డ్వేన్ బ్రావో, డానియల్ సామ్స్, గెరాల్డ్ కోట్జీ... టెక్సాస్ సూపర్ కింగ్స్‌కి ఫారిన్ ప్లేయర్లుగా ఉన్నారు. ఈ విషయాన్ని అంబటి రాయుడు ట్విట్టర్ ద్వారా ధృవీకరించాడు..

Scroll to load tweet…

‘సేమ్ ఎల్లో‌లవ్... డిఫరెంట్ కాంటినెంట్... టెక్సైటెడ్... ’ అంటూ ట్వీట్ చేశాడు అంబటి రాయుడు. మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడబోతున్న 9వ భారత క్రికెటర్‌గా నిలవబోతున్నాడు అంబటి రాయుడు. జూలై 13 నుంచి మేజర్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ ప్రారంభం కానుంది.

ఇప్పటికే 2012 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌తో పాటు అతని టీమ్‌ మేట్ స్మిత్ పటేల్ కూడా మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడబోతున్నాడు. ఈ ఇద్దరితో పాటు హర్మ్‌ప్రీత్ సింగ్, తజిందర్ సింగ్, ఛైతన్య భిష్ణోయ్, సౌరబ్ నెట్రావల్కర్, శరబ్‌జిత్ లడ్డా, మిలంద్ కుమార్ కూడా మేజర్ లీగ్ క్రికెట్‌కి ఎంపికయ్యారు. 

ఐపీఎల్‌లో మోస్ట్ అండర్‌రేటెడ్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాయుడు, 2019 వన్డే వరల్డ్ కప్‌కి ముందే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు... ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫెయిలైన తర్వాత రిటైర్మెంట్ ట్వీట్ చేసిన అంబటి రాయుడు, కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ని డిలీట్ చేశాడు. ఆ సమయంలో అంబటి రాయుడు ఫ్రస్టేషన్‌తో ఆ ట్వీట్ చేశాడని చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ వ్యాఖ్యానించాడు..

బీసీసీఐ అనుమతి లేని ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఆడి, ఐపీఎల్‌లోకి వచ్చి 200+ మ్యాచులు ఆడిన అంబటి రాయుడు, రిటైర్మెంట్ తర్వాత ఫారిన్ లీగుల్లోనూ మెరవబోతుండడం విశేషం.