ప్రవీణ్ తాంబే తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన రెండో భారత క్రికెటర్‌గా అంబటి రాయుడి రికార్డు.. 3 మ్యాచులకే వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి అవుట్.. 

బీసీసీఐకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఫారిన్ లీగుల్లో పాల్గొంటున్నాడు ఆంధ్రా క్రికెటర్ అంబటి రాయుడు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత టీమిండియాకి అన్ని ఫార్మాట్ల రిటైర్మెంట్ ఇచ్చిన అంబటి రాయుడు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించిన అంబటి రాయుడు, ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్ 2023)లో పాల్గొంటున్నాడు. 

ప్రవీణ్ తాంబే తర్వాత కరేబియర్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన రెండో భారత క్రికెటర్ అంబటి రాయుడు. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రాయిట్స్ తరుపున ఆడుతున్న అంబటి రాయుడు, సీపీఎల్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.

ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో 32 పరుగులు చేసిన అంబటి రాయుడు, మూడో మ్యాచ్‌లో 15 పరుగులు చేశాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సిక్సర్ బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అంబటి రాయుడు..3 మ్యాచుల్లో 117.5 స్ట్రైయిక్ రేటుతో 15.66 సగటుతో 47 పరుగులు చేసిన అంబటి రాయుడు, వ్యక్తిగత కారణాలతో కరేబియన్ ప్రీమియర్ లీగ్ మధ్యలో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అంబటి రాయుడితో పాటు సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రాయిట్స్ తరుపున ఆడుతున్న జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ కూడా వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు..

ఇప్పటిదాకా 3 మ్యాచులు ఆడిన బ్లెస్సింగ్ ముజరబానీ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అంబటి రాయుడి ప్లేస్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ విల్ సమీద్, ముజరబానీ స్థానంలో బెన్నీ హోవెల్... సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రాయిట్స్ తరుపున ఆడబోతున్నారు..

Scroll to load tweet…

ఎవిన్ లూయిస్ కెప్టెన్సీలో మొదటి నాలుగు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రాయిట్స్ , ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. వరుస పరాజయాలతో కెప్టెన్ ఎవిన్ లూయిస్ స్థానంలో షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్‌కి కెప్టెన్సీ ఇచ్చినా విజయం మాత్రం దక్కలేదు. 

సౌతాఫ్రికా20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తరుపున, ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరుపున అంబటి రాయుడు ఆడబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ రెండు జట్లూ తమ టీమ్‌ తరుపున అంబటి రాయుడు ఆడబోతున్నట్టు ప్రకటించాయి కూడా. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ రెండు లీగ్‌ల్లో పాల్గొనలేదు 37 ఏళ్ల అంబటి రాయుడు.. 

గుంటూర్‌లో పుట్టిన అంబటి రాయుడు, తన కెరీర్‌లో టీమిండియా తరుపున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచులు ఆడి 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేశాడు. నాలుగో స్థానంలో బాగా ఆడుతున్న అంబటి రాయుడికి, 2019 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2019 ప్రపంచ కప్‌లో చోటు దక్కకపోవడంతో మనస్థాపంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అంబటి రాయుడు, ఆ తర్వాత రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నా.. టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.