రేపట్నుంచే మహిళల టీ20 ప్రపంచకప్.. హర్మన్‌ప్రీత్ సేన ఈసారైనా...!
Womens T20 World Cup 2023: క్రికెట్ ప్రేమికులకు మరో గుడ్ న్యూస్. కొద్దిరోజుల క్రితమే మహిళల అండర్ - 19 టీ20 ప్రపంచకప్ ను నిర్వహించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా సీనియర్ వరల్డ్ కప్ కు సిద్ధమైంది.

క్రికెట్ ప్రేమికులకు మరోసారి ప్రపంచకప్ వినోదం అందనుంది. రేపట్నంచి ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ను నిర్వహించనుంది. ఇటీవలే అండర్ - 19 మహిళల ప్రపంచకప్ ను విజయవంతంగా నిర్వహించిన ఐసీసీ.. ఇప్పుడు సీనియర్ వరల్డ్ కప్ ను కూడా అంతకన్నా ఘనంగా సక్సెస్ చేయాలని భావిస్తున్నది. తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికా - శ్రీలంకల మధ్య జరుగనుంది. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత టోర్నీ (2020) లో ఫైనల్ వరకూ చేరిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఈ సారైనా విశ్వవిజేతలుగా నిలిచేనా..?
2009 నుంచి ఐసీసీ ప్రతి రెండేండ్లకోసారి మహిళల టీ20 ప్రపంచకప్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 8 ఎడిషన్లు జరగగా అధికారికంగా రేపట్నుంచి మొదలుకాబోయేది 9వ ఎడిషన్. 2009 నుంచీ పోటీలో ఉంటున్న భారత్.. 2020లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. గత టోర్నీలో భారత్.. ఫైనల్ లో ఆసీస్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది.
భారత్ మెరిసేనా..?
ఈ టోర్నీలో భారత్ మొత్తంగా 31 మ్యాచ్ లు ఆడి 17 గెలిచి 14 మ్యాచ్ లలో ఓడింది. అయితే గతంతో పోలిస్తే భారత్ బాగా మెరుగుపడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా లతో పాటు ఆల్ రౌండర్లు స్నేహ్ రాణా, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో రాజేశ్వరి గైక్వాడ్ తో పాటు యువ సంచలనం రేణుకా ఠాకూర్ లు కొత్తబంతితో నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవలే షెఫాలీ వర్మ సారథ్యంలోని అండర్ - 19 భారత జట్టు టోర్నీ గెలవడం హర్మన్ ప్రీత్ సేనకు బూస్ట్ ఇచ్చేదే. అదీగాక ఆ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించిన షెఫాలీ.. సీనియర్ స్థాయిలో కూడా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది.
తొలి మ్యాచ్ దాయాదితోనే..
రేపట్నుంచి టోర్నీ ప్రారంభమవుతుండగా భారత్.. తన తొలి మ్యాచ్ ను దాయాది దేశం పాకిస్తాన్ తో ఆడనుంది. గ్రూప్-బీలో భాగంగా ఈనెల 12న భారత్ - పాక్ మధ్య మ్యాచ్ తో ఈ టోర్నీలో భారత్ ప్రపంచకప్ వేట మొదలవుతుంది.
టీమిండియా షెడ్యూల్ :
- ఫిబ్రవరి 12న భారత్ వర్సెస్ పాకిస్తాన్
- ఫిబ్రవరి 15న భారత్ వర్సెస్ వెస్టిండీస్
- ఫిబ్రవరి 18న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్
- ఫిబ్రవరి 20న భారత్ వర్సెస్ ఐర్లాండ్
- టీమిండియా మ్యాచ్ లన్నీ భారత కాలమానం సాయంత్రం 6.30 గంటలకు మొదలవుతాయి.
ప్రపంచకప్ కు భారత జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుకా సింగ్ ఠాకూర్, అంజలి సర్వని, పూజా వస్త్రాకార్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే
రిజర్వ్ ప్లేయర్లు : సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్
ఎలా చూడొచ్చు..
మహిళల టీ20 ప్రపంచకప్ ను స్టార్ స్పోర్ట్స్ తో పాటు డిస్నీ హాట్ స్టార్ లలో లైవ్ చూడొచ్చు.