Asianet News TeluguAsianet News Telugu

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు సర్వం సిద్ధం.. టీమ్స్, లైవ్ టెలికాస్ట్ వివరాలివే..

WTC Final 2023: రెండేండ్ల ఐసీసీ  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2021 - 2023) సైకిల్‌కు ఎండ్ కార్డ్ పడే రోజు ఆసన్నమైంది. బుధవారం నుంచి ఇండియా - ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ - 2023 జరుగనుంది. 

All Set For ICC WTC Final 2023, Here is The  Venue, Broadcast, Team Details MSV
Author
First Published Jun 6, 2023, 5:10 PM IST

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తర్వాత  భారత్ - ఆస్ట్రేలియా జట్లు మళ్లీ అంతర్జాతీయ రంగంలోకి దూకాయి.  మార్చి తర్వాత  రెండు నెలల పాటు  ఐపీఎల్ - 16 బిజీలో గడిపిన ఇరు దేశాల క్రికెటర్లు  ఇప్పుడు ముఖాముఖి తలపడబోతున్నారు. ఐసీసీ రెండేండ్లకోమారు నిర్వహించే  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ బుధవారం నుంచి జరుగనుంది.  ఈ మేరకు ఇంగ్లాండ్ లోని ‘ఓవల్’ మైదానం  సిద్ధమైంది. మరి ఓవల్‌లో ‘గద’ అందుకునేది ఎవరు..?   జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి..? ఈ ప్రతిష్టాత్మక ఫైనల్‌ను లైవ్ చూడటమెలా..? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 

రెండేండ్లకోసారి  జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో  భాగంగా టాప్ - 2 లో  నిలిచిన టీమ్స్  తుదిపోరులో తలపడతాయన్న సంగతి తెలిసిందే. ఈ రెండేండ్లలో ఆస్ట్రేలియా 19 మ్యాచ్ లు ఆడ 11 గెలిచి మూడు ఓడి, ఐదింటిని డ్రా చేసుకుని  152 పాయింట్స్‌తో తొలి స్థానంలో  నిలిచింది. రెండో  స్థానంలో ఉన్న టీమిండియా.. 18 టెస్టుటలో పది గెలిచి ఐదు ఓడి మూడింటిని డ్రా చేసుకుని 127 పాయింట్లతో  రెండో స్థానంలో ఉంది. 

టీమిండియాకు బ్యాటింగే బలం.. 

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బ్యాటింగే అతిపెద్ద బలం.  గడిచిన ఆరు నెలలుగా టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు పరుగుల వరద పారిస్తుండటం  భారత జట్టుకు కలిసొచ్చేదే.  ఐపీఎల్‌లో విఫలమైనా రోహిత్  టెస్టులలో మంచి టచ్ లోనే ఉన్నాడు. 2021లో ఇదే వేదికలో  ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో రోహిత్ సెంచరీ చేశాడు. పుజారా కూడా కౌంటీ ఛాంపియన్‌షిప్ లో మూడు సెంచరీలు బాది వచ్చాడు.  సుమారు ఏడాదిన్నర తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న అజింక్యా రహానే  ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శనలు చేశాడు.  భారత బ్యాటింగ్‌లో వీళ్లే కీలకం. 

వికెట్ కీపర్‌గా ఇషాన్ - భరత్‌ల మధ్య ఎవరిని ఎంచుకుంటారనేది ఇంకా క్లారిటీ లేదు.  బ్యాటింగ్ బలంగా ఉన్నా టీమిండియాకు బౌలింగ్ కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా అంతా  మన బౌలర్ల మీదే ఆధారపడి ఉంది.  డ్రై వికెట్ అయిన ఓవల్ మొదటి మూడు రోజులు  బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. మరి ఈ   బౌన్సీ పిచ్ పై  షమీ, సిరాజ్ లతో పాటు  మూడో పేసర్ గా ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. శార్దూల్, ఉమేశ్ లలో  ఎవరిని ఎంచుకుంటారనేదానిపై టీమిండియా పేస్ బలం ఆధారపడి ఉంది.  స్పిన్నర్లలో  రవీంద్ర జడేజా - అశ్విన్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం కావొచ్చు.

జోరుమీదున్న ఆసీస్.. 

డబ్ల్యూటీసీలో భాగంగా ఈ సైకిల్ లో వరుస విజయాలతో ఆస్ట్రేలియా జోరుమీదుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తేలిపోయినా ఆసీస్ ను తక్కువ  అంచనా వేయడానికి లేదు. ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా కండిషన్స్‌కకు సరిపోయేలా ఉండటం కంగారూకు కలిసొచ్చేదే. ఆ జట్టులో కూడా ప్రమాదరక ఆటగాళ్లకు కొదవలేదు. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ రూపంలో ఆ జట్టుకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరికి తోడు యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఉండటం ఆ జట్టుకు అదనపు బలం. 

హెజిల్‌వుడ్ గాయంతో దూరమైనా  మిచెల్ స్టార్క్,   స్కాట్ బొలాండ్ తో  పాటు కెప్టెన్ పాట్ కమిన్స్   లు ఓవల్ లో టీమిండియా బ్యాటర్ల పని పట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గ్రీన్ కూడా మీడియం పేసర్ కావడంతో ఆ జట్టుకు నాలుగో పేసర్ కూడా దొరికాడు.  స్పిన్నర్లలో లియాన్ ప్రమాదకారే. 

ఇతర వివరాలు : 

- డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ది ఓవల్ (లండన్) మైదానంలో జరుగనుంది. 

- ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది.  వర్షం  అంతరాయం కలిగిస్తే.. కోల్పోయిన సమయాన్ని మిగిలిన రోజులతో పాటు  రిజర్వ్ డే (జూన్ 12) లో ఆడిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా రోజు మొత్తం తుడిచిపెట్టుకుపోతే  రిజర్వ్ డే న  నిర్వహిస్తారు. మ్యాచ్ ఐదో రోజు ముగిసేనాటికి మ్యాచ్ టై అయినా, డ్రా అయినా ఇరు జట్లనూ  సంయుక్త విజేతలుగా  ప్రకటిస్తారు. 

 

-  భారత కాలమానం  ప్రకారం  7-11  తేదీలలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 

- ఈ మ్యాచ్‌లు స్టార్ నెట్వర్క్ ఛానెల్స్ (స్టార్‌ స్పోర్ట్స్‌ 1, స్టార్‌స్పోర్ట్స్‌ 2, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ)లో ప్రసారమవుతాయి. హిందీ, ఇంగ్లీష్ లతో పాటు  తెలుగు, తమిళం, కన్నడ లలో కూడా మ్యాచ్ ను వీక్షించొచ్చు. మొబైల్ ద్వారా చూడాలనుకునేవారు  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  ప్రసారమవుతుంది. 

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇరు జట్లు : 

భారత జట్టు:  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్, ఇషాన్ కిషన్,  రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్ 

స్టాండ్ బై ఆటగాళ్లు : యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, ముకేష్ కుమార్

ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, మైకెల్ నెసెర్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, టాడ్  మర్ఫీ, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్,  స్కాట్ బొలాండ్, 

స్టాండ్ బై ఆటగాళ్లు : మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా

Follow Us:
Download App:
  • android
  • ios