BCCI: ప్రపంచ సంపన్న క్రికెట్ బోర్డుగా గుర్తింపు పొందిన బీసీసీఐకి స్పాన్సర్ల మధ్య లుకలుకలు మొదలయ్యాయా..? తాజా పరిణామాలు చూస్తే ఇదే అనుమానం రాకమానదు.
ప్రపంచ క్రికెట్ ను కనుసైగతో శాసిస్తున్న బీసీసీఐ.. స్థానిక స్పాన్సర్లతో చిక్కులు ఎదురుకుంటున్నది. ఐపీఎల్-15 ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో బీసీసీఐపై గుర్రుగా ఉన్న స్పాన్సర్లు.. తమ స్పాన్సర్షిప్ ను వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పలు స్పాన్సర్లు బీసీసీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా తాజాగా ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ, టైటిల్ స్పాన్సర్ పేటీఎం తమ స్పాన్సర్షిప్ ను రద్దు చేయాలని బీసీసీఐని కోరిందని తెలుస్తున్నది.
భారత్ లో జరిగే సిరీస్ లకు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న పేటీఎం.. రూ. 326.80 కోట్లతో 2019 లో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేండ్ల పాటు (2023 దాకా) ఈ ఒప్పందం కొనసాగాల్సి ఉంది. కానీ మరో ఏడాది గడువు ఉండగానే పేటీఎం మాత్రం బీసీసీఐతో ‘సంబంధాలు’ తెంచుకోవాలని భావిస్తున్నది.
ఈ మేరకు గురువారం ముంబైలో ముగిసిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. తాము టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకుంటామని బీసీసీఐకి సమాచారమందించినట్టు తెలుస్తున్నది. తమ డీల్ ను ‘మాస్టర్ కార్డ్’ కు మళ్లించాలని కూడా ప్రతిపాదన తెచ్చింది. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘అవును. వాళ్లు (పేటీఎం) తమ హక్కులను మాస్టర్ కార్డ్ కు మళ్లించమని రిక్వెస్ట్ చేశారు. వాళ్లకు ఆ హక్కు ఉంది. కానీ అది జులై 1 కంటే ముందు చేసి ఉంటే బాగుండేది..’ అని తెలిపారు.
పేటీఎం కథ ఇది..
- 2015లో పేటీఎం తొలిసారి టైటిల్ స్పాన్సర్ గా ఫీల్డ్ లోకి వచ్చింది.
- 2019లో ఈ డీల్ ను నాలుగేండ్ల పాటు పునరుద్దరించుకుంది.
- డీల్ ఒప్పందం రూ. 326.80 కోట్లు.ఒప్పందం ప్రకారం 2023 వరకు కొనసాగాలి.
- 2019 వరకు మ్యాచ్ కు రూ. 2.4 కోట్ల ఉన్న విలువను 2019 తర్వాత రూ. 3.80 కోట్లకు పెంచి మరీ హక్కులు దక్కించుకున్న పేటీఎం అర్థాంతరంగా స్పాన్సర్షిప్ నుంచి వైదొలగాలని ప్రతిపాదించడం గమనార్హం.
ఇదేం కొత్త కాదు..
స్పాన్సర్లు మధ్యలోనే కాడి వదిలేసి వెళ్లడం బీసీసీఐకి ఇదే కొత్త కాదు. గతంలో ఒప్పో (టీమ్ జెర్సీ) కూడా మధ్యలోనే తమ ఒప్పందాన్ని కాదనుకుంది. ఇక ఐపీఎల్-2021 రెండో అర్థభాగంలో టైటిల్ స్పాన్సర్ వివో కూడా ఈ డీల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ స్థానంలో టాటా వచ్చి చేరింది. ఒప్పో స్థానాన్ని బైజూస్ భర్తీ చేస్తున్నది.
బైజూస్ కూడా...
టీమిండియా జెర్సీ స్పాన్సర్ అయిన బైజూస్ తో కూడా బీసీసీఐకి సంబంధాలు గొప్పగా ఏం లేవని తెలుస్తున్నది. 2022 జులై నాటికి బైజూస్.. బీసీసీఐకి రూ. 86.21 కోట్ల బాకీ ఉన్నట్టు తెలుస్తున్నది. అంతకుముందు మార్చి 2022 నాటికి చెల్లించాల్సి ఉన్న రూ. 22.22 కోట్లను కూడా బైజూస్ చెల్లించలేదని సమాచారం. దీనిపై కూడా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ లో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
