టీం ఇండియా క్రికెటర్ అజింక్య రహానే  ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. అందుకే సమయమంతా కూతురితో ఆనందంగా గడుపుతున్నాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకునేందుకు... భార్య, కుమార్తెతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ ఫోటోలో కుమార్తెను చేతుల్లోకి తీసుకొని ప్రేమగా చూస్తున్నాడు. ఆ పిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఫోటో అద్భుతంగా ఉందని కొందరు, ఇంకొందరు తండ్రి అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా.... ఈ నూతన తల్లిదండ్రులకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు.

'రాధిక, రహానే మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. తొలిసారి తల్లిదండ్రులయ్యారు. ఈ ఆనందంతో ఏదీ సరితూగదు. ఆ ఆనందంలో మునిగితేలండి. డైపర్లు మారుస్తూ నైట్‌వాచ్‌మెన్‌గా కొత్త అవతారాన్ని ఎంజాయ్‌ చెయ్ రహానే' అని సచిన్ పేర్కొన్నాడు. 

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ శనివారమే రహానేకు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'కొత్త తండ్రికి అభినందలు. రహానే భార్య రాధికకు, చిన్న రాణికి కూడా కంగ్రాట్స్‌. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నా. రహానే.. ఇప్పుడు జీవితంలో సరదా పార్ట్‌ మొదలైంది' అని హర్భజన్‌ పేర్కొన్నాడు. టీమిండియా వన్డే వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ సైతం ట్విటర్‌ వేదికగా రహానే కుంటుంబానికి శుభాకాంక్షలు తెలిపాడు. 'నువ్వు జీవితాంతం ఆడే ఉత్తమ ఇన్నింగ్స్‌ ఇదే. అప్పుడప్పుడూ సమయాన్ని ఆస్వాదించు' అని ట్వీట్‌ చేశాడు.

రహానే తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికాను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. తొలుత స్కూల్‌ మేట్స్‌గా ఆరంభమైన వీరి ప్రయాణం.. ఆపై ఫ్రెండ్‌షిప్‌కు దారి తీసింది. అది మరింత బలపడి ప్రేమకు దారి తీసింది. 2014లో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2019లో తల్లిదండ్రులయ్యారు.