అంతర్జాతీయ క్రికెట్లోకి అజింక్య రహానే అడుగుపెట్టి చాలాకాలమైంది. అయితే అతడి బ్యాటింగ్ శైలి పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే టెస్ట్ క్రికెట్ కు సరిగ్గా సరిపోతుంది. దీంతో ఈమధ్యకాలంలో అతడు కేవలం టెస్ట్ క్రికెట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే టీ20, వన్డే మ్యాచుల కోసం సెలెక్టర్లు కనీసం అతడిపేరును కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. దీనిపై తాజాగా రహానే స్పందించారు. 

''మనకి ఏది రాసిపెట్టివుంటే అదే జరుగుతుంది. నాకు భారత క్రికెటర్ మారాలని రాసిపెట్టుంది కాబట్టే అదే జరిగింది.  దేనికోసమైనా మన శక్తిమేర ప్రయత్నించాలి... ఫలితాన్ని ఆ భగవంతుడిపైనే వదిలెయాలి. మనకు దక్కాల్సి వుంటే ఎన్ని అడ్డంకుల ఎదురయినా దక్కుతుంది. ఒకవేళ మనది కాకుంటే ఎంత ప్రయత్నించినా ఫలితముండదు. దీన్ని నేను బలంగా నమ్ముతాను.

టెస్టుల్లో సెంచరీ కోసం దాదాపు రెండేళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది. కానీ ఎప్పుడూ సెంచరీ సాధించలేకపోయానే అని బాధపడలేదు. అందుకోసం ప్రతి మ్యాచ్ లోనూ పట్టువదలకుండా ప్రయత్నిస్తూనేవున్నాను. చివరకు ఇటీవల వెస్టిండిస్ పర్యటనలో భాగంగా 17వ టెస్ట్ లో సెంచరీ సాధించగలిగాను. 

వెస్టిండిస్ పర్యటనలో రాణించడంవల్లే స్వదేశంలో జరగనున్న టెస్ట్ సీరిస్ లో చోటు దక్కింది. ప్రతి మ్యాచ్ లోనూ నా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాను. ఉపఖండం పిచ్ లకు తగ్గట్లుగా నా బ్యాటింగ్ స్టైల్ వుంటుంది. కాబట్టి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్ లో ఉత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాను.'' అని రహానే పేర్కోన్నాడు.