Aiden Markram: దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను రాబోయే సీజన్ లో నడిపించబోతున్న ఎయిడెన్ మార్క్‌రమ్ కు బంపరాఫర్. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ట్రోఫీ గెలవడం అతడికి కలిసొచ్చింది.
దక్షిణాఫ్రికా వేదికగా ఇటీవలే ముగిసిన ఎస్ఎ టీ20 లీగ్ ట్రోఫీని ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పెట్టుబడులు పెట్టిన సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈస్ట్రన్ కేప్ ను సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ఎయిడెన్ మార్క్‌రమ్ ముందుండి నడిపించాడు. ఈ ట్రోఫీ గెలిచిన అనంతరం మార్క్‌రమ్ కు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ కూడా దక్కింది. ఇప్పుడు మార్క్‌రమ్.. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును కూడా నడిపించనున్నాడు.
టీ20 ఫార్మాట్ లో మార్క్‌రమ్ ను సారథిగా నియమిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన వెల్లడించింది. ఇన్నాళ్లు వన్డేలతో పాటు టీ20 సారథ్య బాధ్యతలును చూసుకున్న టెంబ బవుమాను తప్పించిన ఆ జట్టు.. మార్క్‌రమ్ కే పగ్గాలు అప్పజెప్పింది.
స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగబోయే టీ20 సిరీస్ నుంచే మార్క్‌రమ్ సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు. డీన్ ఎల్గర్ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న వేళ.. టెస్టులతో పాటు వన్డేలలో బవుమాను కెప్టెన్ గా కొనసాగించిన దక్షిణాఫ్రికా బోర్డు.. టీ20 పగ్గాలను మాత్రం మార్క్‌రమ్ కే అప్పగించింది. టీమ్ లో డేవిడ్ మిల్లర్ ఉన్నా మార్క్‌రమ్ కే సారథ్య పగ్గాలు అప్పజెప్పడం దక్షిణాఫ్రికా అభిమానుల ఆశ్చర్యానికి గురిచేసినా ఎస్ఎ20లో ఈస్ట్రన్ కేప్ సారథి ప్రదర్శన చూశాక సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మనసు మార్చుకుంది.
ఇక దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జేపీ డుమిని ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఎంపికయ్యాడు. బౌలింగ్ కోచ్ గా రోరీ క్లీన్‌వెల్డ్ వ్యవహరించబోతున్నాడు. కాగా విండీస్ తో జరుగబోయే టీ20 సిరీస్ లో ఆ జట్టు మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ తిరిగి జట్టులోకి చేరతాడన్న వార్తలు వినిపించాయి. కానీ దక్షిణాఫ్రికా బోర్డు మాత్రం డుప్లెసిస్ చేరికపై పెద్దగా ఆసక్తి చూపలేదు. డుప్లెసిస్ తో హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ జరిపిన చర్చలు విఫలమైనట్టు సమాచారం.
కాగా వెస్టిండీస్ తో ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న దక్షిణాఫ్రికా.. ఈనెల 8 నుంచి రెండో టెస్టు ఆడనుంది. తొలి టెస్టులో సౌతాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. మార్చి 16 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. మార్చి 25, 26, 28లలో మూడు టీ20లు జరుగుతాయి.
టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, రిలీ రోసో , ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సేన్, వేన్ పార్నెల్, సిసంద మగల, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్త్జ్, కగిసొ రబాడా, తబ్రైజ్ షంసీ, జార్న్ ఫోర్టుయిన్
