WTC Finals 2023: వచ్చే నెల 7 -11 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపయన్‌షిప్ కు ముందు భారత్ కు గుడ్ న్యూస్.   ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా..  శతకాల మోత మోగిస్తున్నాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కు ముందు టీమిండియాకు గాయాల బాధలే కాదు మంచి కూడా జరుగుతోంది. ఇంగ్లాండ్ లోనే ఉన్న టీమిండియా టాపార్డర్ బ్యాటర్, నయా వాల్ ఛతేశ్వర్ పుజారా మరో శతకం బాదాడు. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా.. శతకాల మోత మోగిస్తున్నాడు. ఈ సీజన్ లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న పుజారా.. మూడు సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కౌంటీలలో ససెక్స్ సారథిగా ఉన్న పుజారా.. వార్విక్‌షైర్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు.

కౌంటీ ఛాంపియన్ డివిజన్ 2 - 2023 లో భాగంగా పుజారా ఇప్పటికే డర్హమ్, గ్లోస్టర్‌షైర్ తో మ్యాచ్ లలో శతకాలు చేశాడు. తాజాగా వార్విక్‌షైర్ తో మ్యాచ్ లో 189 బంతులాడి 19 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో 136 పరుగులు చేశాడు. పుజారా సెంచరీతో ససెక్స్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 373 పరుగులకు ఆలౌట్ అయింది.

పుజారా - స్మిత్ కలిసి.. 

వచ్చే నెల 7 నుంచి 11 వరకు ది ఓవల్ వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియాలు తలపడబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్ల తరఫున దిగ్గజ ఆటగాళ్లుగా ఉన్న పుజారా, స్టీవ్ స్మిత్ లు ప్రస్తుతానికైతే కలిసి ఆడారు. పుజారా ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ టీమ్ లోనే స్టీవ్ స్మిత్ కూడా ఆడుతున్నాడు. నిన్న వీళ్లిద్దరూ కలిసి బ్యాటింగ్ చేయడం విశేషం. ససెక్స్ జట్టులో పుజారా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రాగా స్మిత్ ఐదో స్థానంలో వచ్చాడు. స్మిత్.. 57 బంతుల్లో 30 పరుగులు చేసి నిష్క్రమించాడు. పుజారా - స్మిత్ లు కలిసి నాలుగో వికెట్ కు 61 పరుగులు జోడించడం విశేషం.

Scroll to load tweet…

సచిన్ సరసన.. 

తాజా సెంచరీతో పుజారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. నిన్నటి సెంచరీతో పుజారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 19 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వసీం జాఫర్ ల సరసన నిలిచాడు. పుజారా ఇదే ఫామ్ కొనసాగిస్తే భారత్ కు వెయ్యి ఏనుగుల బలం. ఇప్పటికే టీమిండియా ప్రధాన బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, కెఎల్ రాహుల్ లు గాయాలపాలవడంతో భారత జట్టు బ్యాటింగ్ కు చాలా నష్టం వాటిల్లింది. ఐపీఎల్ లో అదరగొడుతున్న రహానేకు పుజారా జతకూడితే అది భారత్ కు చాలా ప్లస్ అవుతుంది.